విభజన నిర్ణయం ఉపసంహరించే వరకూ దీక్ష

కడప, 12 ఆగస్టు 2013 :

రాష్ట్రాన్ని విభ‌జించాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని, తమ ప్రాణాలు పోయినా లెక్కచేయబోమని వారు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌ చేస్తూ.. వీకిద్దరూ సోమవారంనాడు కడపలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కుయుక్తులను, టిడిపి నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పోరాటం సాగించేందుకు శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మరో 50 మంది కడప కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షా వేదిక మీద ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వారు దీక్షను ప్రారంభించారు.

తెలుగుతల్లి కడుపుకోతకు గురయ్యే పరిస్థితి కల్పించినా, విభజన పేరుతో సీమకు అన్యాయం జరగబోతోందని తెలిసినా అధికార పార్టీ ‌నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీని నిలదీయాల్సిన ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్‌ పార్టీకి దాసోహం అంటున్నారని నిప్పులు చెరిగారు.

కాగా, పార్టీ శ్రీకాంత్‌రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రాకపోవండంతో ఆమరణదీక్ష చేపట్టారు. శ్రీకాంత్‌రెడ్డి దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి, పార్టీ వైయస్ఆర్‌ జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు సహా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు, స్థానికులు విశేష సంఖ్యలో తరలి వచ్చారు. దీక్ష ప్రారంభానికి ముందుగా సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులకు దీక్షా ప్రాంగణంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం 'సమైక్యాంధ్ర అమర వీరులకు జోహార్‌.. జోహార్‌' అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి నినాదాలు చేశారు. దీక్షా ప్రాంగణం 'జై సమైక్యాంధ్ర' నినాదాలతో దద్దరిల్లింది. 'కుటిల రాజకీయాలు వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు' అనే నినాదం రాసిన బ్యానర్‌ను దీక్షా వేదిక మీద ఏర్పాటు చేశారు.

Back to Top