దోచుకున్న సొమ్ముతో అత్యుత్సాహం

ఏమీ చేయకుండానే యాత్రలా
ప్రభుత్వంపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్
కనీసం మూడు వారాలైన సమావేశాలుండాలి
ఓటుకు కోట్లు కోసమే ఉద్యోగుల తరలింపు

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చి 18 నెలలయినా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చకుండా..... జన చైతన్యయాత్రల పేరుతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో దోచుకున్న సొమ్ముతో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని నిప్పులు చెరిగారు. జాతీయ జెండా స్థూపానికి  పచ్చరంగులు వేసి పండుగలు చేసుకునే  స్థితికి దిగజారారని పచ్చనేతలపై శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 

రైతులు , అంగన్ వాడీలు, నిరుపేదలు సహా రాష్ట్రంలో అనేక సమస్యలపై చర్చించాల్సి ఉండగా.. ప్రభుత్వం 4,5 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చూడడం దారుణమన్నారు. ప్రతిపక్షాన్ని ఎదురుదాడి చేసి తూతూమంత్రంతో ముగించేవిధంగా కాకుండా క్షుణ్ణంగా చర్చ జరిపేవిధంగా కనీసం మూడు వారాలైనా సమావేశాలు జరపాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు , డ్వాక్రారుణాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి సహా ప్రభుత్వం ఇచ్చిన వందలాది వాగ్దానాలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. పెన్షన్ లలో అర్హులైన వారిని పక్కనబెట్టి  టీడీపీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

రాష్ట్రంలో లక్షా 42 వేల ఖాళీలుంటే...ఉద్యోగాలు లేవని ఏపీపీఎస్సీ  నో వేకెన్సీ బోర్డు పెట్టడం బాధాకరమని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఖాళీలను భర్తీ  చేయాల్సిన కమిషన్ ఉద్యోగాలు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు.  ప్రభుత్వం ఎలాంటి వసతి సౌకర్యాలు చూపించకుండానే హడావుడిగా ఉద్యోగులను తరలించేందుకు ఆదేశాలివ్వడంపై శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు, రాజధానిలో ధరలు తగ్గకుండా చూసుకునేందుకే చంద్రబాబు ఉద్యోగులను తరలిరమ్మంటున్నారని విరుచుకుపడ్డారు. 

ఉత్తరాంధ్రలో బాక్సైట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారో ముఖ్యమంత్రి మాట్లాడరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 90 శాతం పూర్తయిన తోటపల్లి ప్రాజెక్ట్ గురించి పట్టించుకోరు. రాయలసీమలో మహానేత హయాంలో 80 శాతం పనులు పూర్తయిన గాలేరు-నగరి ప్రాజెక్ట్ విషయంలో మాత్రం అంతకుఅంతకు అంచనాలు పెంచేసి ఆర్భాటంగా టెండర్లు వేయించారు.  రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థంకాని విధంగా ప్రభుత్వ పాలన సాగుతుండడం దౌర్భాగ్యమన్నారు. విజయవాడలో జరిగిన కల్తీ మద్యం ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల  కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. 

Back to Top