ఎన్నికల ఫలితాలపై జగన్ సమీక్షలు

హైదరాబాద్:

ఇటీవలే ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జూన్ 4 నుంచి సమీక్షించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. దీనితో పాటు పార్టీ నాయకులు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను సమీక్షించడంతో పాటు పార్టీని బలోపేతం చేయడానికి మార్గనిర్ధేశం చేయనున్నారు. నియోజవర్గాల వారీగా జరిగే ఈ సమీక్షా సమావేశాల్లో సాధారణ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, అక్కడి జెడ్పీటీసీ అభ్యర్థులు, మండల పార్టీ కన్వీనర్లతో పాటు నియోజకవర్గంలో 10 నుంచి 15 మంది ముఖ్య నేతలు కూడా పాల్గొంటారని పార్టీ సీజీసీ సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమీక్షా సమావేశాల వివరాలను వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశాల అనంతరం భవిష్యత్ కార్యాచరణతో, నేతల్లో ఆత్మస్థ‌ైర్యం నింపి మరింత ఉత్సాహంగా పనిచేయించడమే లక్ష్యంగా శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తారని మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి తెలిపారు. ముందుగా జూన్ 4, 5, 6 తేదీల్లో రాజమండ్రిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై శ్రీ జగన్ సమీక్షిస్తారని మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి చెప్పారు. ‘9, 10 తేదీల్లో  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమీక్ష ఒంగోలులో ఉంటుంది. 11, 12 తేదీల్లో అనంతపురంలో రాయలసీమ జిల్లాల సమీక్షలు ఉంటాయన్నారు.

తెలంగాణ ప్రాంత పార్టీ ఎమ్మెల్యేల సమావేశంతో పాటు పార్టీ లోక్‌సభ సభ్యుల సమావేశం హైదరాబాద్‌లో శనివారం వేర్వేరుగా జరుగుతాయని వారు తెలిపారు. ఎంపీల సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నాయకుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. లోక్‌సభ మొదటి విడత సమావేశాల్లో పార్టీ ఎలాంటి అంశాలను ప్రస్తావించాలన్న దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

ఎస్పీవై రెడ్డికి నోటీసులు
వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అభ్యర్థిగా నంద్యాల నుంచి లో‌క్‌సభ సభ్యుడిగా గెలిచి తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎస్పీవై రెడ్డికి నోటీసు ఇవ్వనున్నట్టు మైసూరారెడ్డి చెప్పారు. నిర్ణీత సమయంలోనే ఆయనకు నోటీసు ఇస్తామన్నారు. కొన్ని పత్రికలు, మీడియా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు పార్టీని వీడతారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అది తప్పుడు ప్రచారమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Back to Top