ప్రజా తీర్పును గౌరవిస్తాం

హైదరాబాద్:

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజల తరఫున నిలబడి పోరాడతామని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

‘పార్టీని ప్రారంభించినప్పుడు నేను, మా అమ్మ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికలతో మా సంఖ్య ఇద్దరు ఎంపీలు, ఇరవై మంది ఎమ్మెల్యేలకు చేరుకుంది. ఇప్పుడు ఆ సంఖ్య పది మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు తోడుగా నిలబడతాం. వారి సమస్యల్లో పాలు పంచుకుంటాం. గత నాలుగున్నరేళ్లుగా ఏ విధంగా ప్రజల వెంట ఉన్నామో అదేవిధంగా ఇకపై కూడా ఉంటాం. ప్రజల విశ్వాసం చూరగొంటాం. అధికారంలోకి వస్తాం’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ధృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయాలు సాధించిన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మోడీ గాలి, బాబు తప్పుడు వాగ్దానాలు :
దేశ వ్యాప్తంగా నెలకొన్న నరేంద్ర మోడీ గాలి, చంద్రబాబు నాయుడు చేసిన తప్పుడు వాగ్దానాలను ప్రజలు నమ్మడం.. ఈ రెండు అంశాలే తమ ఓటమికి దారితీశాయని శ్రీ జగన్మోహన్‌రెడ్డి విశ్లేషించారు. ఈ రెండు కారణాల వల్ల తమకు తగిలిన దెబ్బ నుంచి కోలుకుంటామని, ప్రతిపక్షంలో ఉండి మళ్లీ ప్రజల తరఫున నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. ‘మేమెప్పుడూ ప్రజలనే నమ్ముతాం. వారినే విశ్వసిస్తాం. మా నమ్మకం వారిపైనే’ అన్నారు. ‘నా మీద, పార్టీ మీద నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నాకు, వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కూ ఓట్లేసిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు.. ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అని ఆయన అన్నారు.

ప్రజలతోనే మా పొత్తు :

ఓటమి నేపథ్యంలో ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ‘మాకెలాంటి పొత్తులూ ఎవరితోనూ అవసరం లేదు. ఇంతకు ముందు కూడా పొత్తులు పెట్టుకోలేదు. ప్రజలతోనే మేం పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటే అదే మాకు పది వేలు’ అని ఆయన పేర్కొన్నారు. తామేమీ ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలోకి రాలేదని, తొలుత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినపుడు తాను, తన తల్లి మాత్రమే ఉన్నామని, ఈ రోజు తమ సంఖ్య 70 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలకు పెరిగిందని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. ఈ ఫలితాలు తనకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయని.. మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఉద్యమాల్లో మేమే ఉన్నాం.. చంద్రబాబు లే‌రు :
‘ఇంతకాలంగా ఎక్కడ సమస్యలుంటే అక్కడ జగన్ ఉన్నాడు. ప్రతి ఉద్యమం, ప్రతి ధర్నా చేసింది జగనే‌. ప్రజల తరఫున నిలబడింది మేమే. కానీ మోడీ గాలి ఉండటం, చంద్రబాబు తప్పుడు వాగ్దానాలను ప్రజలు విశ్వసించడం వల్ల దెబ్బ తిన్నాం’ అని ఆయన అన్నారు. ‘ఎక్కడ సమస్యలుంటే అక్కడ జగన్ ఉన్నాడు, చంద్రబాబు లే‌రు. అది ఫీజు రీయింబర్సుమెంట్ సమస్య కావచ్చు, చేనేత కార్మికుల ఆత్మహత్యల విషయంలో కావచ్చు, రైతులు పంటలకు విరామం (క్రా‌ప్ హాలిడే) ప్రకటించినప్పుడు కావచ్చు.. జగనే కనిపించాడు కానీ అక్కడ చంద్రబాబును మీరెప్పుడూ చూడలేదు.‌ అయినా సరే ప్రజలిచ్చిన ఈ తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్షంలో కూర్చుని ప్రజల కోసమే పోరాడుతాం’ అని శ్రీ జగన్ అన్నారు.

‌కొన్నిసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు బెడిసికొడతాయంటూ.. శ్రీమతి విజయమ్మ పరాజయంపై శ్రీ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న మోడీ గాలిని మనం చూశాం కదా.. అది కూడా పరిగణనలోకి తీసుకోవాలి..’ అని అన్నారు. చంద్రబాబు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని కక్ష సాధించే అవకాశాలుంటాయని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. ‘నాపై సోనియా చేయగలిగినంత చేశారు. పోరాడాం. ఇప్పుడు చంద్రబాబు ఏదైనా చేస్తే కూడా పోరాడతాం. ఏమీ తేడా ఉండదు. అంతిమంగా నేను దేవుణ్ని నమ్ముతాను. విధిని నమ్ముతాను, ఆయనే నాకు దారి చూపుతాడు ’ అని శ్రీ జగన్ సమాధానం ఇచ్చారు.

Back to Top