పేదోళ్ళ గుండెల్లో పెద్దకొడుకు వైయస్ఆర్

పాలసముద్రం (చిత్తూరు జిల్లా) :

'మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి నాలుగున్నరేళ్లు అవుతున్నా ఇప్పటికీ  జనం గుండె చప్పుళ్లలో సజీవంగానే ఉన్నారు. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పిన మహా నాయకుడాయన. రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువెత్తు చిరునామాగా నిలిచారు. పేదవాడి గుండె చప్పుడును హృదయంతో విన్న డాక్టర్‌. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాడి కుటుంబానికి ఆయన పెద్దకొడుకు. అలాంటి ప్రియతమ మహానేత‌ మన నుంచి దూరమయ్యాక రాజకీయాల్లో విశ్వసనీయత కనుమరుగైపోయింది. రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరువయ్యాడు’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాలను ఇప్పుడు చదరంగంలా మార్చేసి, ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని లెక్కలు వేస్తున్నారే తప్ప పేదల గురించి ఆలోచించడమే లేదని శ్రీ జగన్ అన్నారు. నాలుగ‌వ విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ను ఆయన శుక్రవారం ఐదవ రోజు శుక్రవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో కొనసాగించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు.

అందుకే ఆయన జనం గుండెల్లో నిలిచారు :

‘ఎనిమిదిన్నర కోట్ల మందిలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దేవుడు ఒక్కరికే ఇస్తాడు. పదవిలో ఉన్నప్పుడు తమ కోసం ఏం చేశామన్న ప్రాతిపదికగానే ప్రజలు మనల్ని చనిపోయాక గానీ, పదవి నుంచి దిగిపోయాక గానీ గుర్తు పెట్టుకుంటారు. మహానేత మన నుంచి దూరమై నాలుగున్నరేళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఆయన తమ గుండెల్లోనే సజీవంగా ఉన్నారని ఇంత మంది గర్వంగా చెప్పుకుంటున్నారంటే అందుకు కారణం.. పదవిలో ఉన్న ప్రతిక్షణం ఆ మహానేత ప్రజల బాగోగుల కోసం పరితపించడమే. మండుటెండలో 1,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను అతి దగ్గర నుంచి ఆయన గమనించారన్నారు.

'పేదవాడు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి పిల్లల చదువులు, మరొకటి అనుకోకుండా వచ్చిపడే ఆరోగ్య సమస్యలు. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపితే పేదవాడిని అప్పుల ఊబి నుంచి బయటపడేయగలం అని వైయస్ఆర్ భావించారు. అందుకే పెద్ద చదువులకు పేదరికం అడ్డురాకుండా ఫీజు రీయింబ‌ర్సుమెంట్ పథకాన్ని పెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఎంతమంది అర్హులుంటే అందరికీ ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఈ పథకాలను రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అమలు చేశారన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వుల కోసం ప్రతిక్షణమూ తపించారని తెలిపారు.

రాజకీయాల్లో ఇప్పుడు విశ్వసనీయత అనేదే లేకుండా పోయిందని శ్రీ‌ జగన్ విచారం వ్యక్తంచేశారు. ఎత్తులు, పైఎత్తుల రాజకీయ చదరంగంలో పేదవాణ్ణి ఎప్పుడో పక్కకు నెట్టేశారన్నారు. ఈ రోజు ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలి? ప్రత్యర్థిపై ఎలా కేసులు పెట్టాలి? ఎలా జైల్లో పెట్టాలి? అన్న అంశాలే రాజకీయాలైపోయాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో అర్థమవుతుందన్నారు.

ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక చేత్తో సైగ చేసి కొందరు టీడీపీ ఎమ్మెల్యేలతో సమైక్యం అనిపిస్తారని, మరో చేత్తో సైగచేసి టీటీడీపీ ఎమ్మెల్యేలతో విభజన నినాదాలు చేయిస్తారన్నారు. ఇదా రాజకీయం అంటే? అన్నారు. రాజకీయాల్లో విలువలు లేని ఈ పరిస్థితిని మనమే మార్చుకోవాలి. ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో విభజన కుట్రదారులను బంగాళాఖాతంలో కలిపేద్దాం. 30 మంది ఎంపీలను మనమే గెలిపించుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాన్ని విభజించే సాహసం ఎవరు చేస్తారో చూద్దాం అని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top