ఆందోళనకర స్థాయికి‌ చేరిన జగన్ ఆరోగ్యం

హైదరాబాద్‌, 29 ఆగస్టు 2013:

జైలు నిర్బంధంలో ఉంటూనే సమన్యాయం కోసం గడచిన ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఆరోగ్యం గురువారం ఆందోళనకరంగా మారింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పరీక్షించిన జైలు వైద్యులు శ్రీ జగన్ రక్తంలో ఒక్కసారిగా  చక్కెర శాతం సాధారణ స్థాయి కన్నా‌ బాగా దిగువకు పడిపోయినట్లు నిర్థారించారు. రక్తంలో ప్రస్తుతం 57 ఎంజిలుగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని వైద్యులు తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బిపి కూడా బాగా తగ్గిందని వైద్యులు తెలిపారు. శ్రీ జగన్‌ను వెంటనే ఆహారం తీసుకోవాలని, లేకపోతే ఆయన ఆరోగ్యం మరింతగా దిగజారిపోతుందని సూచించారు. అయితే అందుకు శ్రీ జగన్ సమ్మతించలేదు.

‌బాగా నీరసంగా ఉన్నప్పటికీ శ్రీ జగన్ తనకు ఎలాంటి ఆహారం వద్దని తిరస్కరించినట్లు జైలు అధికారు‌లు తెలిపారు. ఆహారం తీసుకోమని తనను బలవంతం చేయవద్దని ఆయన అధికారులను కోరినట్లు చెబుతున్నారు. జైలు డాక్టర్లు, జైలు సూపరిటెండెంట్‌తో చర్చలు జరిపిన అనంతరం శ్రీ జగన్మోహన్‌రెడ్డి రక్త పరీక్ష నివేదికలతో జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ వద్దకు అధికారులు బయలుదే‌రి వెళ్ళారు. ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్న శ్రీ జగన్ చేత దీక్షను ఎలా విరమింపజేయాలనే విషయమై ఐజీ వద్ద చర్చలు జరిగాక ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యాన్ని తదుపరి జైలులో ఉన్న వైద్యులే పర్యవేక్షిస్తారా లేక సౌకర్యాలున్న బయటి ఆసుపత్రికి తరలించాలా అనేది కూడా ఇంకా అధికారులు నిర్ణయం తీసుకోలేదు. అయితే వైద్యుల సూచనల మేరకు తాము శ్రీ జగన్ విషయంలో వ్యవహరిస్తామని తెలిపారు.

Back to Top