తిరుమల శ్రీనివాసుని సేవలో వైయస్ జగ‌న్

తిరుమల:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదివారంనాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి పాదాల వద్ద ఉన్న తులసి, ప్రసాదాలను శ్రీ జగన్‌కు ఆలయ అర్చకులు అందజేశారు. అనంతరం ఆయన వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.

‌అనంతరం నృశింహస్వామిని‌ శ్రీ జగన్ దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా, జేఈవో శ్రీనివాసరాజు పట్టువస్త్రంతో సత్కరించి లడ్డూ, ప్రసాదాలు అందజేశారు. డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ శ్రీవారి తీర్థం, అన్న ప్రసాదాలను అందజేశారు. బెల్లం పొంగలి, మిరియాల పొంగలిని‌ శ్రీ వైయస్ జగన్ స్వీకరించారు. శ్రీవారిని‌ దర్శించుకున్న సమయంలో శ్రీ జగన్ సంప్రదాయ పట్టువస్త్రాలు ధరించారు. పట్టుపంచె, లేత తెలుపు, చారల చొక్కా ధరించి మెడలో పట్టు ఉత్తరీయం వేసుకున్నారు.

‘రాష్ర్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాను’ అని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పై విధంగా స్పందించారు.

డిక్లరేషన్ అవసరం లేదు: చెవిరెడ్డి
దేవు‌ని సేవలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వై‌యస్ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో స్వామివారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉం‌ది కదా అన్న ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు.
‘ఈ రాష్ట్రాన్ని పరిపాలించినంతకాలం మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి క్రమం తప్పకుండా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తి విశ్వాసాలతో ఆయన వచ్చినన్నిసార్లు ఏ ముఖ్యమం‌త్రీ కూడా తిరుమలకు రాలేదు. చిన్నతనం నుంచి తండ్రితో పాటు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అనేక సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. దేవుని సేవలో ఉన్నవారు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని ‌చెవిరెడ్డి వివరణ ఇచ్చారు.

Back to Top