బాబు హయాంలో భయానక పాలన

శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా) :

‘మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాక ముందు రాష్ట్రంలో ఒక భయానక పరిపాలన ఉండేది. ఆ రోజులు నాకు బాగా గుర్తు. పల్లెల్లోకి వెళ్లినప్పుడు అవ్వా తాతలు ‘నాయనా నాకు పింఛన్ ఇప్పించు’ అని దీనంగా అడిగేవారు. పింఛ‌న్ ఎంతిస్తారవ్వా అని అడిగితే ‘డెబ్బై రూపాయలిస్తారు నాయనా’ అని చెప్పేవారు. ముష్టి డెబ్బై రూపాయల‌ కోసం ఈ వృద్ధులు ఇంతగా దేబిరించాలా అని బాధేసేది. సంబంధిత ఎమ్మార్వోకో, ఆర్డీవోకో ఫోన్ చేసి ఆ వృద్ధుల పింఛ‌న్ గురించి అడిగితే వారు చెప్పే సమాధానం విన్నప్పుడు మరింత బాధేసేది. ఆ గ్రామానికి వృద్ధాప్య పింఛన్ల కోటా పది మాత్రమే. ఇప్పుడు పింఛ‌న్ తీసుకుంటున్న వారిలో ఎవరో ఒకరు చనిపోతే అప్పుడు మీరు సిఫారసు చేసిన వ్యక్తికి పింఛ‌న్ ఇవ్వడానికి వీలవుతుందని సమాధానం చెప్పేవారు. అంతటి దౌర్భాగ్య పాలనకు చరమగీతం పాడేందుకు మహానేత వై‌యస్ఆర్ నడుం బిగించారు’ అని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు.

శ్రీ వైయస్‌ జగన్‌ చిత్తూరు జిల్లాలో నాలుగవ విడత నిర్వహిస్తున్న ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ తొమ్మిదవ రోజు మంగళవారం సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కొనసాగించారు. శ్రీకాళహస్తిలో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు.

'మహానేత డాక్టర్‌ వైయస్ఆర్ అధికారంలోకి రా‌క ముందు రాష్ట్ర ప్రజలు వరుస కరువులతో అల్లాడిపోయేవారు. వారి కష్టాలను పట్టించుకునే నాథుడు లేడు. పింఛను కోసం సాటి వ్యక్తి చావు కోసం ఎదురు చూడాల్సిన అమానవీయ పరిస్థితులను కల్పించిన పాలన అది. డ్వాక్రా మహిళలకు అప్పులిచ్చి రూపాయిన్నర వడ్డీతో వారి రక్తాన్ని పీల్చేసిన పాలన అది. ఆ రోజులు తలుచుకుంటేనే భయమేస్తోంది. వరుస కరువులతో రైతులు కరెంటు బిల్లు కూడా కట్టలేకపోయేవారు. వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వండని వై‌యస్ఆర్ డిమాండ్ చేస్తే ఉచితంగా విద్యు‌త్ ఇస్తే ఆ తీగలు బట్టలారేసుకునేందుకు తప్ప ఎందుకూ పనికిరావంటూ అవహేళన చేసిన పాలన అది. చివరకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ‘వారు తిన్నది అరగక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని’ ఎగతాళి చేసిన పాలన అది.

పేద‌ల ముఖంలో చిరునవ్వు కోసం తపించిన మహానేత :
'ప్రజాకంటక చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు నాడు మహానేత వైయస్ఆర్ నడుం బిగించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా దాదాపు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పేదవాడి గుండె చప్పుడును దగ్గర నుంచి విన్నారు. తాను ముఖ్యమంత్రి కాగానే పేదవాడి గుండె చప్పుడుకు అనుగుణంగా పాలన‌ అందించారు. పేదల ముఖంలో చిరునవ్వు పూయించాలని తపన పడ్డారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఈ వేళ ‘వైయస్ బతికుంటే ఎంత బాగుండు’ అని అనుకుంటున్నారు.

ప్రస్తుత రాజకీయాల్లో నిజాయితీ ‌ఏదీ ?:
'మన నుంచి మహానేత దూరమైన తరువాత రాజకీయాల్లో విశ్వసనీయతే లేకుండా పోయింది. రాజకీయాల్లో ఎంత వెతికినా నిజాయితీ కనిపించడంలేదు. సోనియా గాంధీ తన కొడుకును ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టేందుకు మన రాష్ట్రాన్ని నిలువునా చీల్చేందుకు సిద్ధపడ్డారు. మన ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అసెంబ్లీలో చర్చలు చూస్తోంటే బాధనిపిస్తోంది. ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం విభజన బిల్లు రాష్ట్రానికి పంపితే దానిపై అసెంబ్లీలో ఎడతెగని చర్చలు చేస్తున్నారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు పంపిన బిల్లును వెనక్కు పంపుతున్నాం అని ఒక్క ముక్కలో తేల్చేయాల్సిన అంశాన్ని ఇలా సాగదీస్తున్నారు. సోనియా, కిరణ్, చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను పై నుంచి దేవుడు చూస్తూనే ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ను అభిమానించే ప్రతి గుండె చప్పుడు ఒక్కటి అవుతుంది. ఉప్పెన సృష్టిస్తుంది. ఆ ఉప్పెనతో విభజన కుట్రదారులు బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు’ అని శ్రీ జగన్‌ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top