విభజన పేరుతో అధ్వాన్న రాజకీయాలు

చిత్తూరు :

ప్రజా సమస్యలపై కాకుండా రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలన్న అధ్వాన్న రాజకీయాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వీలైనన్ని ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి సీటులో కూర్చోవడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను ఢిల్లీ అహంకారానికి అమ్మకం పెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనను చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్యాకేజీలు అడుగుతూ.. కుమ్మక్కు రాజకీయలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావం యాత్ర మూడవ విడత 8వ రోజు ఆదివారం చిత్తూరు నియోజకవర్గంలో జరిగింది. చిత్తూరు, పాలడుగు మండల కేంద్రాల్లో జరిగిని బహిరంగ సభలకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, స్థానికులను ఉద్దేశించి శ్రీ జగన్‌ ప్రసంగించారు.

‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా పాలన చేస్తూ.. సమైక్యం ముసుగు కప్పుకొని ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు. సమైక్యాంధ్ర కోరుకుంటున్న 70 శాతం మంది ఉసురు ఉప్పెనై లేస్తుంది. ఆ ఉప్పెనలో సోనియాగాంధీ, చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి అడ్రస్ గల్లంతవుతుంది’ అ‌ని శ్రీ వైయస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.

శ్రీ జగన్ ప్రసంగ‌ సారాంశం :
బిందె నీటిని ప్రజలు రూ. 5 పెట్టి కొనాల్సి వస్తోంది:

`చిత్తూరులో రూ.2 నుంచి రూ.5 పెట్టి బిందెడు నీళ్లు కొనాల్సి వస్తోందని అక్కాచెల్లెమ్మలు ఆవేదనతో చెబుతున్నారు. వంటగ్యాస్‌కు సబ్సిడీ కూడా అందడం లేదని బాధపడుతున్నారు. కరెంటు చార్జీలు షాక్ కొడు‌తున్నాయని, వెయ్యి అడుగుల లోతు బోరు వేసినా చుక్క నీరు దొరకటం లేదని రైతన్నలు బాధపడుతున్నారు. ఫీజు రీయింబర్సుమెంటు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ చార్జీల మోత మోగిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి 133 రోగాలు తొలగించారు. ఈ ప్రజాసమస్యల్లో ఏ ఒక్కదానిపై కూడా అసెంబ్లీలో చర్చ జరగడం లేదు. నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు టీవీ పెడితే చాలు వాళ్ల నిజ స్వరూపం బయటపడుతుంది' అని శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు.

`చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీకి వస్తారు. కానీ అసెంబ్లీలో మాత్రం కనిపించరు. చంద్రబాబు అయితే ఏసీ రూంలో కూర్చొని ఒకవైపు సీమాంధ్ర ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్ర అనిపిస్తారు. తెలంగాణ ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని విడగొట్టాలని అనిపిస్తారు. వీరిద్దరూ కలిసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతున్నారు. రేపు మీరిద్దరు ఈ జిల్లాకు వచ్చినపుడు చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలని మీ కాలర్ పట్టుకొని అడిగితే ఏం చెబుతారు? సాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలని రైతులు నిలదీస్తే ఏం సమాధానం చెబుతారు‌'? అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిందే :
`మన రాష్ట్రానికి దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని అన్యాయం జరుగుతోంది. మనకు సంబంధం లేకుండానే మనల్ని విడగొడతారట. దేశంలోని ప్రతి నాయకుడు కూడా ‘మీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది’ అని చెప్తున్నారు. ఇది మనమంతా ఏకం కావాల్సిన సమయం. కానీ ఢిల్లీ కుమ్మక్కు రాజకీయాలను బద్దలు కొట్టాల్సింది పోయి కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియా గీసిన గీత దాటడం లేదు. ఆమెను నిలదీయాల్సిన చంద్రబాబు ప్యాకేజీలతో కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ మన గడ్డపై పుట్టి మనకే ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికైనా వీరిద్దరూ సమైక్య రాష్ట్రం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా చేయాలి' అని‌ శ్రీ వైయస్ జగన్‌ డిమాండ్‌ చేశారు.

`త్వరలోనే ఎన్నికలు వస్తాయి. అప్పుడు మనందరం ఒక్కటవుదాం. 30 ఎంపీ స్థానాలను తెచ్చుకుందాం. ఢిల్లీ కోటను బద్దలుకొడదాం. ఆ కోటను మనమే పునర్నిర్మిద్దాం. మన రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరికుందో చూద్దాం. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడతాం’ అన్నారు.

ముగిసిన మూడవ విడత సమైక్య శంకారావం యాత్ర :
చిత్తూరు జిల్లాలో మూడవ విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ముగిసింది. ఈ నెల 5 నుంచి మొదలైన మూడవ విడత యాత్ర 8 రోజులు కొనసాగింది. చిత్తూరు బహిరంగ సభలో ప్రసంగించిన శ్రీ జగన్ రోడ్డు మార్గంలో నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబా‌ద్‌ చేరుకున్నారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిత్తూరులో 9 నియోజకవర్గాల్లో పర్యటించిన శ్రీ జగన్‌ 15 కుటుంబాలను ఓదార్చారని ఆయన వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top