సోనియా నాటకాన్ని రక్తి‌ కట్టిస్తున్న కిరణ్

కొత్తమిట్టపల్లి (చిత్తూరు జిల్లా) :

సోనియాగాంధీ రచించిన విభజన నాటకాన్ని సమైక్యవాది ముసుగులో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బాగా రక్తి కట్టిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం, తన కొడుకును ప్రధాని పదవిలో చూసుకోవడం కోసం మన రాష్ట్రాన్ని సోనియా గాంధీ నిట్ట నిలువునా చీల్చేందుకు సిద్ధపడ్డారని, అందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వంత పాడుతున్నారన్నారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు జాతి ఆత్మాభిమానానికి మధ్య ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో విలువలు, విశ్వసనీయత లేని కిరణ్, చంద్రబాబులను చెత్తబుట్టలో విసిరేయాల్సిందే’ అని శ్రీ వైయస్ జగన్‌ నిప్పులు చెరిగారు. శ్రీ జగన్‌ చేస్తున్న ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ నాలుగవ విడత మూడవ రోజున బుధవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగింది. కొత్తపల్లిమిట్ట కూడలిలో జరిగిన బహిరంగ సభలో శ్రీ జగన్ ప్రసంగించారు.‌

రాష్ట్ర విభజనలో కుట్రదారులు సోనియా, కిరణ్, చంద్రబాబులకు బుద్ధి వచ్చేలా వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలను మనమే గెల్చుకుందామని ప్రజలకు శ్రీ జగన్ పిలుపునిచ్చారు.‌ మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఒక్క రాజకీయ నాయకుడికి కూడా ‘విశ్వసనీయత’ అన్న పదానికి అర్థం తెలియకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాలను ఎత్తులు, పైఎత్తుల చదరంగంగా మార్చేశారని దుయ్యబట్టారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ఎలా విభజించాలా అని చూస్తున్నారని నిప్పులు చెరిగారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలను చూస్తే రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో తెలుస్తుందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో కూర్చొని సీమాంధ్ర, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి వారి వారి ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడించడమేమిని విమర్శించారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న చంద్రబాబు ఒక నాయకుడేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రెండవ మాట లేకుండా సమైక్య రాష్ట్రం కావాలని డిమాండ్ చే‌యాలన్నారు. విభజనకు అనుకూలంగా తాను గతంలో ఇచ్చిన లేఖను వెనకకు తీసుకోకుండా పార్టీ నేతలతో రెండు రకాలుగా మాట్లాడించే చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు?

రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటుంటే సీఎంగా కిరణ్ ‌కుమార్‌ రెడ్డి చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. రంగురంగుల టీవీ ప్రకటనల్లో తనను తాను గొప్ప సమైక్యవాదిగా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మరోవైపు సోనియా గీసిన గీత దాటకుండా రాష్ట్ర విభజనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశం కిరణ్‌కు ఉంటే అసెంబ్లీలో ఎప్పుడో ‘సమైక్య’ తీర్మానం చేసి ఉండేవారని శ్రీ జగన్‌ అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top