చంద్రబాబు సహకారంతోనే విభజన

‌పుంగనూరు (చిత్తూరు జిల్లా) :

గొప్ప మాటలు వల్లిస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. అడ్డగోలుగా విభజన జరిగిపోతున్న ఈ సమయంలో కూడా ఆయన అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలంటారే గాని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఒక్క మాట అనడంలేదని దుయ్యబట్టారు. తన కుమారుడు రాహుల్‌ గాంధీని ప్రధాని పదవిలో చూడాలన్న తపనతో మన రాష్ట్రాన్ని నిర్భీతిగా విభజిస్తున్న సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు కుమ్మక్కై అన్ని విధాలా సహకరిస్తున్నారని శ్రీ జగన్‌ నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా సోమవారంనాడు ఆయన చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

తెలుగువారి ఆత్మగౌరవానికి, ఢిల్లీ అహంకారానికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని శ్రీ వైయస్‌ జగన్‌ అభివర్ణించారు. రాష్ట్రాన్ని ముక్కలుచేస్తున్న సోనియా గాంధీకి చంద్రబాబు నాయుడు ఒక పక్కన తోడ్పాటు అందిస్తూనే సమన్యాయం పేరున భారీగా ప్యాకేజీలు అడుగుతున్నారని తూర్పారపట్టారు. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు సమైక్యాన్నే కోరుకుంటున్నా ప్రజా గర్జన సభలో చంద్రబాబు మాత్రం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యంగా ఉంచాలంటూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని శ్రీ జగన్‌ నిలదీశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వాన్ని కాపాడడం వరకు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు‌ కుమ్మక్కయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రజలపై కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచి షా‌క్ కొ‌ట్టిస్తే.. ప్రతిపక్ష పార్టీన్నీ ఒక్కటై అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ రక్షించిన మాట వాస్తవం కాదా? అని అడుగుతున్నా అన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా ఆ రోజు చంద్రబాబు ఓటు వేయించి ఉంటే ఈ పాటికి కాంగ్రెస్ ‌ప్రభుత్వం కూలిపోయి ఉండేది. విభజన జరిగేదే కాదు అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

తిరుపతి ప్రజా గర్జన సభలో గంటకుపైగా మాట్లాడిన చంద్రబాబు సమైక్య నినాదం చేస్తారేమోనని ఆశగా ఎదురుచూశానని శ్రీ జగన్‌ అన్నారు. చంద్రబాబు నాయుడు మారనే మారరు. తిరుపతి సభలో కనీసం ముప్పావు గంట జగన్మోహన్‌రెడ్డిని తిట్టడం కోసమే కేటాయించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఉద్యమంతో ఉడుకుతున్న ఈ వేళ సమైక్య నినాదం తీసుకోమని చంద్రబాబును ప్రతి రైతన్న కాలర్‌ పట్టుకుని అడగబోతున్నాడు. ఉద్యోగం కోసం మేం ఎక్కడికి వెళ్లాలి అని ప్రతి విద్యార్థీ చంద్రబాబును నిలదీసే పరిస్థితి ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడి నోట సమైక్యం అన్న మాట రావడంలేదని విమర్శించారు.

కుమ్మక్కైందెవరు బాబూ మీరా? నేనా?:
'సోనియా గాంధీతో జగన్మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని చంద్రబాబు అంటున్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు?  జగన్మోహన్‌రెడ్డిని ఎవరయ్యా జైల్లో పెట్టించారు? జగన్మోహన్‌రెడ్డి మీద ఎవరయ్యా కేసులు పెట్టారు? దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన 18 నెలల తర్వాత, ‌ఆయన కొడుకైన జగన్ కాంగ్రె‌స్‌ పార్టీని విడిచి రెండు నెలలైన తర్వాత.. ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు, చంద్రబాబు కుమ్మక్కై కోర్టులకు పోవడం నిజం కాదా? ఇద్దరూ కలిసి దివంగత నేత మీద కేసులు వేశారు. ఆయన చెప్పుకోలేడని, ఆయనకు ఎవ్వరూ తోడుగా రారని, ఆయనను బజారుకు ఈడ్చాలని ఇద్దరూ కలసికట్టుగా ప్రయత్నం చేశారు. చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు నిస్సిగ్గుగా కలసికట్టుగా పోటీచేశాయి. ఆర్‌టీఐ కమిషనర్ల పదవులనూ ఇద్దరూ పంచుకునే ప్రయత్నం చేశారు. చిన్న వర్తకులు, రైతులపై ప్రభావం చూపే ఎఫ్‌డీఐల మీద ఓటింగ్ సమయంలో ‌కాంగ్రెస్‌తో మీరు కుమ్మక్కై మీ రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించారు. ఇది కుమ్మక్కు కాదా చంద్రబాబూ?

ఎన్నికలొస్తున్నాయని హామీలా? :
ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో హామీలిస్తున్నావ్‌ చంద్రబాబూ.. మీ మామ ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తే దాన్ని రూ.5.25 చేసింది నువ్వు కాదా? నాడు పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇస్తూ ఎన్నికలకు వెళ్లావ్.. ఎన్నిక‌లయిన తర్వాత ‘ఈనాడు’ పత్రికలో.. మద్యపానం నిషేధిస్తే.. రాష్ట్రమంతా అథోగతి పాలవుతుందని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నది నువ్వు కాదా? మద్యపానాన్ని నిషేధించకపోగా.. ఊరూవాడా బెల్టుషాపులు తెచ్చింది నువ్వు కాదా చంద్రబాబూ? ఇవాళ ఉచితంగా కరెంటు ఇస్తామంటున్న చంద్రబాబూ.. ఆ రోజు.. రూ.50గా ఉన్న హార్సు పవర్ విద్యు‌త్‌ను రూ.625కు పెంచింది నువ్వు కాదా? ఆ వేళ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఉచితంగా కరెంటు ఇచ్చి ఆదుకోండీ అని ప్రతిపక్షాలన్నీ ధర్నాలు చేస్తుంటే.. ‘ఉచితంగా కరెంటు ఇస్తే.. విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికివస్తా’యంటూ కొట్టిపారేసింది నువ్వు కాదా చంద్రబాబూ? ‌రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మీ పార్టీ కాదా? అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబా? అవినీతి గురించి మాట్లాడేది? :
కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై తన మీద సీబీఐ విచారణ జరగకుండా చూసుకున్న చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడుతున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. శ్రీమంతులు గోల్ఫు ఆడుకోవడానికి, వారు ఇళ్లు కట్టుకుని అమ్ముకోవడానికి చంద్రబాబు హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో విలువైన 530 ఎకరాలను ఎమ్మా‌ర్ సంస్థకు అప్పనంగా కేటాయించారని ఆయన చెప్పారు. అది కూడా సింగిల్ టెండరుకు ఇచ్చి అన్ని ఉల్లంఘనలకూ పాల్పడితే.. సీబీఐ చంద్రబాబును కనీసం ఎంక్వైరీకి కూడా పిలవదు. ఇదే చంద్రబాబు ఐఎంజీ భారత సంస్థకు.. హైదరాబా‌ద్ నడిబొడ్డు‌నే ఏకంగా 830 ఎకరాలను విలాసవంతమైన ఇళ్లు కట్టి శ్రీమంతులకు అమ్ముకోవడానికి ఇచ్చారు. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ కేబినెట్‌కు చెప్పకుండా ఒక డమ్మీ కంపెనీకి ఆయన భూములు అక్రమంగా కేటాయింస్తే.. హైకోర్టు చంద్రబాబు మీద ఎంక్వైరీ చేయాలని ఆదేశాలిస్తే.. సీబీఐ చంద్రబాబుకు ఒక నోటీసు కూడా ఇవ్వకుండా చూడ్డానికి ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. ఇటువంటి వ్యక్తా అవినీతి గురించి మాట్లాడేది?‌అని శ్రీ జగన్‌ ప్రశ్నించారు.

 ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఓ వైపు ఉద్యమాలు జరుగుతూ ఉంటే.. చంద్రబాబు గంటలకు గంటలు మీటింగ్ పెట్టి.. అందులో సమైక్యం గురించి మాట్లాడకుండా.. సమైక్య ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేలా.. ఎన్నికల గురించి మాట్లాడ్డం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇవాళ చంద్రబాబుకు చెప్తున్నాను.. మోసం చేస్తున్న కిరణ్ కుమార్‌రెడ్డికీ చెప్తున్నాను. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న సోనియా గాంధీకి చెప్తున్నాను.

చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, సోనియా గాంధీ చేస్తున్న మోసం ఊరికే పోదని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. పై నుంచి దేవుడు కచ్చితంగా చూస్తున్నాడ, త్వరలో ఎన్నికలు వస్తాయని, అప్పుడు ప్రజలందరం కూడా ఒక్కటవుదామని, ఆ ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందామని, ఆ తర్వాత మన రాష్ట్రాన్ని ఎవరు ఎలా విడగొడతారో చూద్దాం అన్నారు. మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెడదామని చెప్పారు.

Back to Top