విద్యార్థుల గల్లంతుపై తక్షణ చర్యలు తీసుకోండి

‌హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ కాలేజీకి చెందిన పలువురు విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంలో గల్లంతైన ఘటనపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఎలాంటి జాప్యమూ చేయకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా చొరవ తీసుకుని సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించాల్సిన అవసరముందన్నారు.

126 మెగా వాట్ల లర్జీ హైడ్రోపవర్ ప్రాజెక్టు కింద విద్యు‌త్ ఉత్పత్తి కోసం ఒక్కసారిగా నదిలోకి నీటిని వదిలినట్టు ప్రమాద‌ం తీరును బట్టి తెలుస్తోందని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయని అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని శ్రీ జగన్ ‌వ్యాఖ్యానించారు. అప్రమత్తం చేసే వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టమవుతోందన్నారు.

కేంద్రంతో సంప్రదింపులు జరిపి సహాయక చర్యలు ముమ్మరం చేయించడంతో పాటు వీలైనంత మేరకు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఢిల్లీలో ఉన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలను‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ముందు ముందు బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు ప్రమాదానికి గురికావడం తనను ఎంతో కలచి వేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

Back to Top