రాష్ట్రాలు వేరైనా తెలుగుజాతి ఒక్కటే

ఖమ్మం:

రాజకీయాలు చేసి భూమిని విడగొట్టగలిగారు కానీ తెలుగువారి మనసులను విడదీయలేరని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘నేను సమైక్యమనే అన్నాను.. సమైక్యమంటే అర్థం నాకు తెలంగాణలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, రాయలసీమ, సీమాంధ్రలోని అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. అందరూ కావాలి. వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమే నా స్వప్నం’ అని స్పష్టం చేశారు. ‘మిగిలిన పార్టీల మాదిరిగా మీరు అలా చేయండి.. మీరు ఇలా చేయండి అని నేను ఏనాడూ ఏ ప్రాంతం వారినీ రెచ్చగొట్టలేదు. ఇటువైపు ప్రాంతం వారి వద్దకు వెళ్లి కిరోసిన్, పెట్రోల్ పోసి తగలబడండి అని చెప్పలేదు. నేను ఒక్కటే నమ్మా. అందరం తెలుగు మాట్లాడుతాం. అందరం తెలుగుబిడ్డలం‌' అని శ్రీ జగన్ అన్నారు.

అవస‌రమైతే అటు వైపునకు.. ఇటువైపున ఉండే తెలుగు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వస్తారని, ఇటువైపు అవసరమైతే అటువైపు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు వచ్చి తోడుగా మేమున్నామని నినదిస్తారని, ఇదే మా తెలుగు జాతి అని గర్వంగా చెబుతారని నమ్మాను. ఇవాళ రెండు రాష్ట్రాలైనా.. వారు భూమిని విడగొట్టగలిగారు కానీ తెలుగువారిని విడగొట్టలేరు. తెలుగు వారి మనసులను విడగొట్టలేరు’ అని ఉద్వేగంగా ప్రసంగించారు. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో బుధవారం సాయంత్రం ఆయన ‘వైయస్ఆర్ జనభేరి’ బహిరంగ సభలో మాట్లాడారు.

‘వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రెండు ప్రాంతాల్లోనూ ఉంటుంది. రెండు ప్రాంతాల్లో రాజన్న రాజ్యం తెస్తుంది. ప్రతి పేదవాడి గుండె చప్పుడు నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ బయటకు వస్తుంది. ప్రతి పేదవాడి మనసు నుంచి బయటకు వస్తుంది. దివంగత ‌మహానేత కలలు కన్న రాజన్న రాజ్యాన్ని తెస్తుంది’ అని శ్రీ జగన్ ఉద్ఘాటించారు. ఈ సభకు హాజరయిన అశేష‌ జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

పేరుపేరునా కృతజ్ఞతలు :
‘సుమారు నాలుగు గంటలు ఆలస్యంగా ఇక్కడకు వచ్చినా.. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఎవరూ కారణాలు వెతుక్కోవడం లేదు. కష్టమనిపించినా, ఆలస్యమైందని తెలిసినా ఇక్కడకు వస్తూనే చిక్కటి చిరునవ్వుతో, ఇంతటి ఆప్యాయత, ఆత్మీయత , ప్రేమానురాగాలు నాపై చూపెడుతున్నారు. ఇక్కడకు తరలివచ్చిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. మీ ఆప్యాయత, ఆత్మీయత, ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా' అన్నారు.

పేదల గుండెల్లో కొలువైన వైయస్:
‌'ప్రాంతాలు, రాజకీయాలు, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి మంచి చేయాలని మహానేత వైయస్ఆర్ తపించా‌రని శ్రీ జగన్‌ పేర్కొన్నారు. పేదల గుండె చప్పుడు ఆయన విన్నారన్నారు. వారి మనసెరిగారన్నారు. ప్రతి పేదవాడి గుండెల్లో కొలువయ్యారు. అందుకే వైయస్ అడ్ర‌స్ అడిగితే నేరుగా గుండెను చూపించి ‘మా గుండె లోతుల్లో ఉన్నా‌రు. ఇదే ఆయన అడ్రస్ అని’ చెపుతారన్నారు. నేను రాముడి రాజ్యం చూడలేదు కానీ... రాజశేఖరుడి సువర్ణయుగం చూశానని గర్వంగా చెప్పగలను. ఏ పేదవాడికైనా అప్పుల పాలయ్యేందుకు రెండు కారణాలుంటాయని వైయస్ఆర్ గ్రహించా‌రన్నారు. ఒకటి పిల్లల చదువులయితే, ఇంకొకటి కుటుంబంలో ఎవరికైనా హఠాత్తుగా ఏదైనా జబ్బు చేసినప్పుడు. ఆ రెండు కారణాల నుంచీ పేదలను రక్షించడానికి ఫీజు రీయింబర్సుమెంటు, ఆరోగ్యశ్రీ పథకాలను ఆయన ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో ఆయన పేదల కోసం పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

ఎక్కడా కనిపించని నిజాయితీ :
మహానేత వైయస్ఆర్ వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లో నిజాయితీ అనే‌ది టార్చిలైట్ వేసినా కనిపించడం లేద‌ని శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎలాగైనా పోరాడాలని, మడమ తిప్పకూడదనే సిద్ధాంతం రాజకీయాల్లో కనిపించడం లేదన్నారు. ఈ రాష్ర్టం ఒక్కటిగా ఉండాలని, ఒక్కటిగా ఉంచాలని, ఒక్కటిగా ఉంటేనే అందరం బాగుంటామని, దేశంలో రెండో పెద్దజాతిని కాపాడుకోవాలని, మూడోస్థానంలో ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ను మొదటి స్థానానికి తేవాలని ఆరాటపడ్డాం. కానీ అలా చేయలేకపోయాం. కేవలం ఓట్లు, సీట్ల కోసం అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయి రాష్ట్రాన్ని విడగొట్టాయి. భావోద్వేగాలతో ఎన్నికలకు వెళ్లడానికి రాజకీయాలు చేస్తున్న అన్యాయమైన పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

భావోద్వేగాలతో ఆడుకోవడం ఏమిటి?
'రాజకీయాలు ఇప్పుడు చదరంగంగా మారిపోయాయి. రాజకీయాల్లో ఒక మనిషిని తప్పించడం కోసం దొంగకేసులు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. ఒక మనిషిని, ఒక పార్టీని తప్పించేందుకు అన్యాయంగా జైలుపాలు చేయడం కోసం వారి మనస్సాక్షి కూడా అడ్డుపడని స్థాయిలో రాజకీయాలు చెడిపోయాయి. కేవలం ఎన్నికలకు నెల రోజుల ముందు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు.

శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తా :
'శీనన్న(పొంగులేటి శ్రీనివాసరెడ్డి) నా పక్కనే ఉన్నాడు. శీనన్నను ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నా. తెలంగాణలో నా మొదటి ఎంపీ అభ్యర్థి ఈ జిల్లా నుంచే.. ఇక్కడి నుంచే అని చెప్పడానికి గర్విస్తున్నా. ఆయనకు సీటు ఇవ్వడమే కాదు.. కేంద్ర మంత్రిని చేస్తా. ఎందుకంటే ఈ జిల్లా బాగుపడాలి. అక్కడ 25 ఎంపీలు, ఇక్కడ 17 ఎంపీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని నా నమ్మకం. అందరం ఒక్కటవుతాం. సీమాంధ్రకు రాజధానిని తీసేశారు. ఇంత డబ్బులిస్తాం... రాజధానిని కట్టుకోండని కూడా చెప్పడం లేదు. అన్యాయం జరిగితే తెలుగు బిడ్డలందరం ఒక్కటవుతాం. ఒక్కటిగా నిలిచి పోరాటం చేస్తాం. నిజంగా ఇక్కడకు వచ్చిన తర్వాత... ఇంత మంది ఆప్యాయతలను చూసినప్పుడు గుండెల నిండా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని గుండెల్లో నింపుకొని పోతున్నా. మీరు చూపించిన ఆప్యాయత, దీవెనలు, ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు.

Back to Top