మీ మాటను మీరే తప్పకండి

హైదరాబాద్, 9 జూన్ 2014:

ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రుణాలన్నీ ఎలాంటి ఆలస్యమూ చేయకుండా వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పంటరుణాలు, బంగారం రుణాలతో పాటు మొత్తం వ్యవసాయ రుణాలకు సంబంధించిన ఎలాంటి అప్పునైనా అణా పైసలతో సహా రద్దు చేస్తామన్న చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు‌ చంద్రబాబు నాయుడికి శ్రీ వైయస్ జగన్‌ సోమవారంనాడు ఒక బహిరంగ లేఖ రాశారు.

‌జూన్ రెండో వారం ‌వచ్చినా రైతులకు ప్రధాన పంట అయిన ఖరీఫ్‌కు కొత్త రుణాలు అందడం లేదని ఆ లేఖలో శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు. ఏ బ్యాంకు నుంచీ కూడా రైతుకు ఒక్క రూపాయి అయినా రుణంగా వచ్చే వాతావరణం కనిపించడంలేదన్నారు. అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాల మాఫీపైనే తొలి సంతకం చేస్తానన్న  మీ మాటలు నమ్మి ప్రజలు మీకు ఓట్లు వేశారు. అధికారాన్ని అప్పగించారు. వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేయాలని మనస్ఫూర్తిగా మేం కోరుకుంటున్నాం. పంట రుణాలు, బంగారం రుణాలతో పాటు వ్యవసాయ రుణాలకు సంబంధించి ఇచ్చిన మాటను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మాఫీ చేయండి అని శ్రీ  వై‌యస్ జగన్‌ డిమాండ్‌ చేశారు.

రైతుకు, రైతాంగానికి, వ్యవసాయానికి, పల్లెలకు, ఆహార భద్రతకు ఎలాంటి అన్యాయం జరగకుండా మీరు వాగ్దానం చేసిన విధంగా రుణమాఫీ చేయండి అని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో శ్రీ జగన్‌ కోరారు. రుణ మాఫీ చేసిన రోజు నుంచీ రైతులకు కొత్త రుణాలు పొందే అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు.  సీఎంగా మీరు ఈ పని చేయడానికి విధివిధానాలతో పనేంటి? వ్యవసాయ రుణాలు, బంగారం రుణాలు ఎన్ని ఉన్నాయో, డ్వాక్రా , చేనేత రుణాలు ఎన్ని ఉన్నాయో అందరికీ తెలుసు. కమిటీలు, 45 రోజుల గడువు వంటి అంశాలు మీరు చేసిన వాగ్దానంలో గాని, టిడిపి మేనిఫెస్టోలో గానీ లేవని శ్రీ జగన్‌ గుర్తుచేశారు.

పుస్తెల తాళ్లు, దస్తావేజులు వెనక్కు వస్తాయంటూ టీవీల్లో ప్రకటనలు ఇచ్చిన మీరు నేడు రైతులను నిరాశ, నిస్పృహలోకి నేట్టివేసి కాలయాపన కమిటీలను నియమించడం సరికాదని శ్రీ జగన్‌ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. తొలి సంతకాలతో ఈ రుణాలన్నీ మీరు రద్దు చేయకపోతే మీ సంతకాల వ్యవహారాన్ని ప్రజలు డ్రామాగా భావించరా? అని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చీ రాగానే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు రూ. 1,000 నుంచి రూ. 1,500కు పెన్షన్‌ ఇస్తామని ఓట్లు అడిగిన సమయంలో చెప్పిన మీరు ఇప్పుడు వాటిని రెండు విడతలుగా ఇస్తామని చెప్పడం సమంజసమా? అని ప్రశ్నించారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని నిరాశకు గురిచేయవద్దని వారి తరఫున శ్రీ జగన్‌ కోరారు. నియోజకవర్గానికి ఒక్కటికి మించి మద్యం దుకాణాలు ఉండకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మద్యం సృష్టిస్తున్న సామాజిక విలయం నుంచి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా మహిళలు, పిల్లలను, సంసారాలను రక్షించాలని చంద్రబాబుకు శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.

ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు రూ. 2,౦౦౦ భృతి ఇస్తామన్న మీ హామీ మేరకు ఫైలుపై తక్షణమే సంతకం చేసి మీరిచ్చిన మాటను నిలబెట్టుకోండి అని చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖలో శ్రీ వైయస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top