కొమరం భీమ్ స్ఫూర్తిగా ముందుకు సాగుదాం



హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పోరాట స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న నాలుగేళ్ళలో టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు ప్రజావ్యతిరేకతలో కొట్టుకుపోవడం ఖాయమని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లే మిగిలి ఉంటాయని అన్నారు. ప్రస్తుతం తమ బలం తక్కువగా ఉన్నా, రానున్న రోజుల్లో దమ్మూ, ధైర్యం, ప్రజా అండ, విశ్వసనీయతతో ముందుకు వెళితే ఆ దేవుడే ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసి, పార్టీ జెండా రెపరెపలాడించే బాధ్యతను ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాలపై మోపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర తొలి సర్వసభ్య సమావేశం తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ వర్ధంతి రోజు బుధవారం మెహదీపట్నంలోని క్రిష్టల్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు ఉప్పొంగిన ఉత్సాహంతో తరలి రావడంతో గార్డెన్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

ఈ సందర్భంగా శ్రీ జగన్ మాట్లాడుతూ...కొమరం భీమ్ వర్థంతి రోజున పార్టీ తొలి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకోవడం మరవలేని విషయం. రాష్ట్రంలో పార్టీ ఉంటుందా? ఉండదా? అని కొందరు వ్యక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్న వ్యక్తులకు ఒక్కటే చెబుతున్నా...యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలని. సోనియాది మన రాష్ట్రం కాకపోయినా, భాష తెలియకపోయినా కాంగ్రెస్ ఉండాలని పాటుపడుతున్నారు. ప్రధాని మోడీకి సైతం ఇక్కడి భాష రాకపోయినా బీజేపీ బలపడటానికి ప్రయత్నం చేస్తోంది. తెలుగు భాష రాని వాళ్ళే ఇక్కడ పరిపాలన చేయాలని ప్రయత్నిస్తుంటే, ఇక్కడే పుట్టి, ఇక్కడి సమస్యలు తెలిసి, ఇక్కడి ప్రజలకు మంచి చేయాలనుకునే తెలుగు పార్టీ ఎందుకు ముందుకు రాకూడదు అని ఆయన ప్రశ్నించారు.

'మరో నాలుగేళ్ళలో టీఆర్ఎస్, టీడీపీ పార్టీలు ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోయే రోజు వస్తుంది. కేసీఆర్ కు ప్రజా వ్యతిరేకత రావడానికి ఏడాది పట్టినా, చంద్రబాబుకు మాత్రం నాలుగు నెలలు మాత్రమే పట్టింది. రోజుకో అబద్ధం, పూటకో మోసం చేస్తున్న బాబుకు ఏపీలో పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుంది. ఎవరిని మోసం చేయడానికి వచ్చావలని ప్రజలే నిలదీసే రోజు వస్తుంది. ప్రజా వ్యతిరేకతలో టీడీపీ, టీఆర్ఎస్ లు కొట్టుకుపోవడం ఖాయం. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రమే మిగులుతాయి. ఈ రోజు మన బలం తక్కువగా ఉందని, మన పార్టీ నేలను గాలం వేసి లాక్కుంటున్నారు. వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ ని టీఆర్ఎస్ అలాగే లాక్కుంది. పార్టీ నుంచి వెళ్ళే నాయకులకు ఒక్కటే చెబుతున్నా...నాలుగేళ్ళ తర్వాత టీఆర్ఎస్ కొట్టుకుపోతే ఎటు పోవాలో నేతలు గుండెల మీద చేయివేసుకుని తేల్చుకోవాలి' అని సూచించారు. నాయకుడు ఎదగాలన్నా, పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రజలు మనవైపు ఉన్నారా? లేరా? అన్నదే ముఖ్యం. నాలుగేళ్ళ కిందటే సోనియాను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన సమయంలో నేను, అమ్మ విజయమ్మ మాత్రమే ఉన్నాం. మా వెంట ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఈ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు, దేవుడే మమ్మల్ని నడిపించారు. మనలో ఖలేజా, విస్వసనీయత ఉంటే ప్రజలు, దేవుడు ఆశీర్వదిస్తారు అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు బడ్జెట్ కత్తిరింపుల పేరుతో పింఛన్లు, ఇళ్ళు, ఫీజులకు కోత పెట్టే ఆలోచనలు చేస్తున్నాయి. కానీ వైఎస్ హయాంలో ప్రతి పేదవానికీ, ఇంటింటికీ సేవ చేశారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వైఎస్సార్ పార్టీలో సువర్ణపాలన వైపు అడుగులు వేయిస్తా. రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎంతున్నది లెక్క చేయకుండా సంక్షేమ ఫలాలను పేదవారికి అందచేద్దాం. దీని కోసం రాష్ట్రంలో పార్టీ జెండా రెపరెపలాడించేందుకు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి అని శ్రీ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.

పరామర్శ పేరుతో జనంలోకి షర్మిళ...
ఇక తెలంగాణలో వైఎస్ మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను షర్మిళ పరామర్శిస్తారని శ్రీ జగన్ తెలిపారు. 'వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటంబాలను పరామర్శిస్తానని మాటిచ్చా. ఆ మాటే నన్ను చాలా మార్చింది. ఎవరూ వెళ్ళని గ్రామాలు, తిరగని పూరి గుడిసెలు తిరిగా, వాళ్ళ కష్టనష్టాలు తెలుసుకుంటే బుర్రలో ఆలోచనలు రావడం ఖాయం. మంచి నాయకుడు కావడం ఖాయం. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఓదార్పు పూర్చి చేసినా మిగతా జిల్లాల్లో వీలు కాలేదు. ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు ఓదార్పు అంటే బాగుండదు కనుక పరామర్శ పేరుతో నా సోదరి షర్మిళ ఆ కుంటుబాలను కలుస్తారు. వారు ఎలా జీవిస్తున్నారో తెలుసుకునే బాధ్యతను షర్మిళపై పెడుతున్నా. వారికి తోడుగా, వారి బతుకులు మార్చే కార్యక్రమాన్ని చూసుకోవాలి. వేరే ఏవైనా సమస్యలు ఉంటే నేనొస్తాను. ధర్నాకు దిగుతాను. మీకు అండగా ఉంటాను' అని శ్రీ జగన్ భరోసా ఇచ్చారు.

వైఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు...షర్మిళ
ఈ సందర్భంగా షర్మిళ మాట్లాడుతూ, 'తెలంగాణకు మేలు చేసిన నాయకులలో వైఎస్ ను మించిన వారు లేరు. సీఎంగా మొదటి రోజే ఉచిత విద్యుత్ పై సంతకం చేశారు. రాష్ట్రంలో 28 లక్షల పంపు సెట్లలో 17 లక్షల పంపు సెట్లు తెలంగాణలోనే ఉన్నాయని తెలిసి, తెలంగాణకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం పెట్టారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిలో తెలంగాణ వారే ఎక్కువ. తెలంగాణలో ఈ రోజు మనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా, వైఎస్ మాత్రం ఈ ప్రాంతంలోని కోట్ల మంది గుండెల్లో ఉన్నారు. ఇక్కడ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలి' అని అన్నారు.

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొంగులేటి
ఇక ఇదే సమావేశంలో పార్టీ తెలంగాణ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిని శ్రీ వైఎస్ జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీని పొంగులేటి ముందుకు నడిపిస్తారని, ఆయన చెల్లెలు షర్మిళ సహకారం అందిస్తారని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన అనంతరం పొంగులేటి మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన శ్రీ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా మీద పెట్టిన నమ్మకం వమ్ము చేయకుండా షర్మిళతో కలిసి పార్టీని పటిష్టం చేస్తా. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వాలపై పోరాడతా అని అన్నారు.

Back to Top