పార్టీ అధ్యక్షునిగా జగన్ ఏకగ్రీవ‌ ఎన్నిక

ఇడుపులపాయ (వైయస్ఆర్‌ జిల్లా) :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షు‌నిగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో ఆదివారం జరిగిన పార్టీ ప్లీనరీ (రెండవ ప్రజా ప్రస్థానం)లో పార్టీ నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య శ్రీ జగన్ ఎన్నికైనట్లుగా సంస్థాగత ఎన్నికల కన్వీన‌ర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఇతరులెవ్వరూ నామినేషన్‌ వేయకపోవడంతో ‌శ్రీ జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే జై జగన్ నినాదాలు‌ ప్లీనరీలో మార్మోగాయి. పార్టీ నియమావళి, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి మూడేళ్లకు ఒకసారి జరగాల్సిన సంస్థాగత ఎన్నికలను నిర్వహించినట్లు ఉమ్మారెడ్డి వెల్లడించారు.‌ శ్రీ జగన్‌ను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని మొత్తం 16 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీ జగన్ సోదరి‌ శ్రీమతి షర్మిల తొలి‌ సెట్ నామినేషన్‌ను ప్రతిపాదించగా వైవీ సుబ్బారెడ్డి బలపరిచారు.

మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కృష్ణారెడ్డి రెండ‌వ సెట్‌ను ప్రతిపాదించారు. దానిని కొలిశెట్టి శివకుమార్ బలపర్చారు. టీఎ‌స్ విజయచంద‌ర్ మూడ‌వ సెట్ నామినేష‌న్‌ను ప్రతిపాదించగా పీఎన్వీ ప్రసాద్ బలపర్చారు. తెలంగాణ నుంచి బాల మణెమ్మ మరో సె‌ట్ నామినేష‌న్‌ను ప్రతిపాదించగా ఎస్.రఘురామిరెడ్డి బలపర్చారు. పార్టీ సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ, జూపూడి ప్రభాక‌ర్‌రావు, తెల్లం బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డితో సహా పలువురు నేతలు శ్రీ జగన్‌ను బలపరుస్తూ నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు.

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ ఉమ్మారెడ్డి వెలువరించారు. ఆ రోజు సాయంత్రం 5 వరకూ నామినేషన్లు స్వీకరించారు. పోటీలో మరెవరూ లేక పోవడంతో ఆదివారం ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాక మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉమ్మారెడ్డి మిన్నుముట్టిన హర్షధ్వానాల మధ్య  ప్రకటించారు. 2013 సెప్టెంబర్, అక్టోబ‌ర్‌ నెలల్లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశాల్లో 23 జిల్లాలకు, 12 మున్సిపల్‌ కార్పొరేషన్ నగరాలకు పార్టీ అధ్యక్షులు ఎన్నికైనట్లు పార్టీ సంస్థాగత కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ పీఎన్వీ ప్రసాద్ వెల్లడించారు.

 జిల్లాల అధ్యక్షులు‌గా ఎన్నికైంది వీరే :
ధర్మాన కృష్ణదాస్ (శ్రీకాకుళం), పెన్మత్స సాంబశివరాజు (విజయనగరం), చెక్కాకుల వెంకట్రావు (విశాఖపట్నం), కుడుపూడి చిట్టబ్బాయ్ (తూర్పు గోదావరి), తెల్లం  బాలరాజు (పశ్చిమ గోదావరి), ఎస్.ఉదయభాను (కృష్ణా), మర్రి రాజశేఖర్ (గుంటూరు), ఎన్.బాలాజీ (ప్రకాశం), ఎం.మురళీధర్ (నెల్లూరు), కె.నారాయణస్వామి (చిత్తూరు), కె.సురేష్‌బాబు (వైయస్సార్), ఎం.శంకరనారాయణ (అనంతపురం), గౌరు వెంకటరెడ్డి (కర్నూలు), కె.వినాయకరెడ్డి (ఆదిలాబాద్), మధురెడ్డి (నిజామాబాద్), సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి (కరీంనగర్), బి.జగపతి(మెదక్), ఎం.సోమేశ్వరరావు (వరంగల్), పాయం వెంకటేశ్వర్లు (ఖమ్మం), ఇ.సి.శేఖర్ గౌడ్ (రంగారెడ్డి), ఆదం విజయ్‌కుమార్ (హైదరాబాద్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), ఎడ్మ కిష్టారెడ్డి (మహబూబ్‌నగర్).

Back to Top