సోనియాను వెళ్ళిపొమ్మంటే ఎలా ఉంటుంది?

హైదరాబాద్ :

ఆరు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్న తెలుగు ప్రజలను ఇప్పుడు విడగొట్టి పొమ్మంటుంటే ఆ బాధ తమకు మాత్రమే తెలుస్తుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద సోమవారం సమైక్య దీక్ష సందర్భంగా ఎన్డీటీవీ గ్రూప్ ఎడిట‌ర్ బర్ఖా ద‌త్తాకు శ్రీ జగన్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘రాజీవ్‌గాంధీని పెళ్లాడి 30 ఏళ్లుగా భారతదేశంలో ఉంటున్న సోనియాను దేశం వదలి పొమ్మంటే ఎలా ఉంటుంది? భారత్‌లో నివసిస్తున్న విదేశీయులంతా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పార్లమెంటులో ఒక చట్టం చేస్తే, అప్పుడు సోనియా ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తే ఆమెకెలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు.

మన దేశంలో ఇప్పుడున్నది ఇండియన్ నేషన‌ల్ కాంగ్రె‌స్ (ఐఎన్‌సీ) కాదని, ఇటాలియన్ నేషన‌ల్ కాంగ్రె‌స్‌గా మారిందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలు సబబేనా అని బర్ఖా ప్రశ్నించగా, ‘భారతీయులైతే ఇక్కడి సమాఖ్య వ్యవస్థను అర్థం చేసుకునే వారు, ఇక్కడి ప్రజల మనోభావాలేమిటో తెలుసుకునేవారు’ అని శ్రీ జగన్ బదులిచ్చారు. ‘రాహు‌ల్‌గాంధీని ప్రధానిని చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ను విభజించబూనారు. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్ల కోసం ఆ ప్రాంతంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది కాంగ్రెసే’ అన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారికే ప్రధాని పదవికి మద్దతిస్తామన్న శ్రీ‌ వైయస్ జగన్ ప్రకటనను బర్ఖా గుర్తు చేశారు. అది నరేంద్ర మోడీకి కూడా వర్తిస్తుందా అని పదే పదే ప్రశ్నించారు. దానికి బదులుగా, ‘మా ఎజెండా ఒకే ఒకటి. అది మా రాష్ట్రం సమైక్యంగా ఉండటం. మా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎవరు కృషిచేస్తే వారికే ఎన్నికల తరవాత మా మద్దతు‌ ఉంటుంది. అందుకు మోడీకి ఎలాంటి మినహాయింపు లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన సహకరిస్తే ఆయనకే మా మద్దతు’ అని శ్రీ జగన్ స్పష్టం చేశారు.

‌పార్లమెంటులో పెప్పర్ స్ప్రే దాడి కాంగ్రె‌స్‌ పార్టీ పథకం ప్రకారమే జరిగిందని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘సభ్యులను సస్పెండ్ చేయకుండా సభ సజావుగా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ పదేపదే చెప్పింది. అందుకే సభలో గందరగోళం సృష్టించి, ఆ సాకుతో సీమాంధ్ర ఎంపీలందరినీ బయటకు పంపి బిల్లు ఆమోదించుకోవాలన్నది కాంగ్రె‌స్‌ కుట్ర’ అని శ్రీ జగన్‌ ఆరోపించారు.

Back to Top