రాజన్న మాట వల్లే దేశమంతా రుణమాఫీ

కాకినాడ:

‘‌మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతి. అందుకే 2004లో ముఖ్యమంత్రి అవగానే రైతుల రుణ మాఫీ కోసం పట్టుబట్టారు. కేంద్రంలో సోనియా, మన్మోహన్‌సింగ్‌లను ఒప్పించి అమలు చేసేందుకు మూడేళ్లు పట్టింది. చివరకు రాజశేఖరరెడ్డి మాట కోసం 2008లో దేశవ్యాప్తంగా అమలు చేశారు' అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖపట్నం నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి వైయస్ విజయమ్మ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీమతి విజయమ్మ బుధవారం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ నియోజకవర్గాల్లో పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

‌'ఆనాడు 65 వేల కోట్లు రుణ మాఫీ చేస్తే మన రాష్ట్రానికి 12 వేల కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. అప్పటికే రుణాలు చెల్లించినవారు నష్టపోకూడదని రాజశేఖరరెడ్డి వారికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకంగా అందించారు. జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాలకు నీరందించాలని. 12 ప్రాజెక్టులు పూర్తిచేసి 25 లక్షల ఎకరాలకు నీరిచ్చారు. 30 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందించారు. ‌మహానేత వైయస్ఆర్ బ్రతి‌కి ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయి ఉండేది. ఇప్పుడైనా జగన్‌బాబును సీఎం చేసుకుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ఈ ప్రాంత పొలాల్లో బంగారం పండుతుంది’ అని ఆమె అన్నారు.

‘రాజశేఖరరెడ్డి భార్యగా, జగన్‌బాబు తల్లిగా ఒక్కటైతే చెబుతున్నా. రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత నాకు ఆ లోటు ఎవరూ తీర్చలేరు. నేను చస్తే కానీ తీరదు. కానీ  మీకు మాత్రం ఆ లోటు‌ను జగన్ తీరుస్తాడు. మీ కష్టంలో, సుఖంలో మీ అందరికీ తోడుంటాడు' అని శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు.

'జగన్‌బాబుకు వాళ్ళ నాయనలా పెద్ద మనసుంది. అందువల్లే అధికారంలోకి రాగానే మొదటిరోజే గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, మరో రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు. రైతులకు పగటి పూటే ఏడు గంటలు విద్యుత్ అందిస్తానని చెప్పాడు. ఇంకా ఎన్నో మేళ్లు చేస్తాడు. నా బిడ్డను మీ బిడ్డగా ఆశీర్వదించండి. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వై‌యస్ఆర్‌సీపీ అభ్యర్థులందరినీ గెలిపించండి’ అని పిలుపునిచ్చారు.

గోదావరి జిల్లాల ప్రజలు, ముఖ్యంగా రాజమండ్రి వాసులు తన కుటుంబంపై చూపిన ప్రేమను గుండెల్లో దాచుకుంటానని శ్రీమతి విజయమ్మ చెప్పారు. జిల్లాలో మూడు రోజులు నిర్వహించిన ‌'వైయస్ఆర్ జనభేరి' బుధవారం రాత్రి రాజమండ్రి సిటీలో ముగిసింది.

Back to Top