అబద్ధాలాడనందుకే ప్రతిపక్షంలో ఉన్నాం

రాజమండ్రి:

‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోక ముందు మన దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. వాటిలో ఏ ఒక్క రాష్ర్టంలోనూ అధికార పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ రైతుల రుణ మాఫీ చేస్తానని చెప్పలేదు. మన రాష్ర్టంలో మాత్రమే అధికారం కోసం చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన హామీలల్లా ఇచ్చారు. రూ.87 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తానని అబద్ధాలాడారు. కోటీ 30 లక్షల మంది మన పార్టీ వైయస్ఆర్‌సీపీకి ఓటు వేస్తే.. టీడీపీకి కోటీ ముప్పై ఐదున్నర లక్షల మంది ఓట్లు వేశారు. మనం చెప్పిన మాటల కంటే చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను కేవలం ఐదున్నర లక్షల మంది ఎక్కువగా నమ్మారు. అందుకే ఆయన అధికారంలోకి వచ్చాడు. మనం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

‘ముఖ్యమంత్రి స్థానంలో ఒకసారి కూర్చుంటే కనీసం 30 ఏళ్ల పాటు ప్రజలకు మేలు చేయాలన్నదే నా తపన. విశ్వసనీయత, విలువలకు కట్టుబడి ఉన్నాను కాబట్టే చంద్రబాబు నాయుడిలా అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయాను’ అని శ్రీ జగన్ చెప్పారు. రాజమండ్రిలో‌ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న ఎన్నికల సమీక్షల సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి శ్రీ వైయస్ జగ‌న్ మా‌ట్లాడారు.

ఈనాడు, జ్యోతి, టీవీ 9 తోనూ పోరాటం చేశాం :
‘రుణ మాఫీ అంటూ అబద్ధం ఆడి ఉంటే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే వాడిని. అయితే మూడు నెలల్లోనే రాష్ర్ట ప్రజలే కాదు.. ఆచరణ సాధ్యం కాని ఆ హామీలు ఎందుకిచ్చారంటూ మీరు కూడా నన్ను తిట్టేవారు. ఆ పని చేయలేకనే నేను ఆ హామీ ఇవ్వలేకపోయాను. మనం గత నాలుగున్నరేళ్లుగా పోరాటం చేసింది చంద్రబాబుతో మాత్రమే కాదు. చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9తో కూడా పోరాటం చేశాం. చంద్రబాబును సీఎం చేయాలని ఆ యెల్లో మీడియా అంతా సర్వశక్తులూ ఒడ్డింది' అని శ్రీ జగన్‌ వ్యాఖ్యానించారు.

'‌ఎన్నికలకు నాలుగు రోజుల ముందు రైతుల రుణ మాఫీ ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమని ‘ఈనాడు’లో బ్యానర్ కథనం రాస్తారు. ఇప్పుడు అదే ‘ఈనాడు’ పేపర్లో నాలుగు రోజుల క్రితం చూస్తే అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ర్టంలో చంద్రబాబు అధికారం చేపట్టాల్సి వస్తోందని, పైగా‌ విభజనకు ముందు ఈ హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఏ విధంగా అమలు చేయగలరనే సందేహాలు ప్రజల్లో కలిగేలా కథనాలు రాస్తున్నా'రన్నారు.

పార్టీ శ్రేణులకు మద్దతుగా ఉందాం :
'చంద్రబాబు నాయుడి బండారం ఈ నెలలోనే బయట పడుతుంది. ఖరీఫ్ సీజ‌న్ మొదలైంది. రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ అమలవుతుందో లేదోననే ఆందోళన వారిలో నెలకొంది. ఒక్క రుణమాఫీయే కాదు.. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏ విధంగా అమలు చేయగలడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి. ఇందు‌ కోసం రానున్న ఐదేళ్లూ పోరాటాలు చేయాలి' అని పార్టీ శ్రేణులకు శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

'ఈ సమయంలో నాయకులపైనే కాదు.. కార్యకర్తలపై కూడా కేసులు పెట్టవచ్చు. వేధింపులకు గురిచేయవచ్చు. ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్తపై ఇటువంటి దాడులు జరిగినా ఆ ఒక్క నియోజకవర్గ పరిధిలోని నాయకులే కాదు.. జిల్లా మొత్తం అక్కడకు వెళ్లి ఆ కార్యకర్తకు అండగా నిలవాలి.. మరోసారి అలాంటి దాడులు చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడాలి' అని సూచించారు.

గ్రామస్థాయి నుంచి వైయస్ఆర్‌సీపీ బలోపేతం చేద్దాం :
‌'ఇకపై గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తాం. గ్రామ కమిటీలను వేయడమే కాకుండా నిరంతరం వాటి పనితీరును మెరుగుపర్చేందుకు కృషిచే స్తాం. అధిష్టానం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ గ్రామస్థాయిలో చర్చించి ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా పార్టీని బూత్ స్థాయి వరకు పటిష్టం చేస్తాం’ అని శ్రీ వైయస్‌ జగన్‌ పార్టీ నాయకులు, శ్రేణులకు వివరించారు.

Back to Top