ఓటర్లూ.. ఒక్క క్షణం ఆలోచించండి

కర్నూలు/అనంతపురం:

మన తలరాతలు మార్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించమని ఓటర్లకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏ నాయకుడు ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో.. ఏ నాయకుడు నిరుపేదల మనసెరిగి ప్రవర్తిస్తాడో.. ఏ నాయకుడు చనిపోయినా పేదవాడి గుండెల్లో సజీవంగా బతికి ఉండగలడో అలాంటి నాయకుడినే ముఖ్యమంత్రిని చేయండని ఆయన పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు సోమవారం ఆయన కర్నూలు జిల్లా కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లా మడకశిర, హిందూపురంలో రోడ్‌షో నిర్వహించి ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు.

అధికారం కోసం‌ పట్టపగలే కళ్ళార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పే.. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చే చంద్రబాబును తరిమితరిమి కొట్టండని శ్రీ జగన్‌ కోరారు. 'మీకు నేను చేసే విజ్ఞాపన ఒక్కటే. విశ్వసనీయతకు ఓటేయండి.. వైయస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం’ అని ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారు :

‌'దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి ముందు ఎందరో ముఖ్యమంత్రులు పనిచేశారు. ఆ మహానేత వెళ్లిపోయిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ.. ఇప్పటికీ కూడా వైయస్ ఎక్కడ ఉన్నా రు అంటే ప్రజలు నేరుగా చేతిని తమ గుండెలవైపు తీసుకెళ్లి.. మా గుండె‌ లోతుల్లో వై‌యస్ రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నారని చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా నాకు వచ్చింది విశ్వసనీయతే. వైయస్ఆర్ వెళ్లిపోయాక ఈ వ్యవస్థ చెడిపోయింది. కేవలం ఓ‌ట్లు, సీట్ల కోసం ఒక మనిషిని లేకుండా చేయాలనుకున్నారు, ఒక పార్టీని లేకుండా చేయాలనుకున్నారు, ఒక మనిషిని జైలుకు పంపారు, రాష్ట్రాన్ని చీల్చడానికీ వెనుకాడలేదు' అని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు.

ఆ తొమ్మిదేళ్లూ ఎందుకు చేయలేదు? :
'తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేసిన పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు అధికారం కోసం అది ఫ్రీగా ఇస్తా.. ఇది ఫ్రీగా ఇస్తా అంటూ మీ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తానని చెబుతున్న హామీల్లో ఏ ఒక్కటైనా తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును గట్టిగా నిలదీయండి. నీ భయానక పాలనలో అధిక ఫీజులు చెల్లించలేక.. చదువుకోవడానికి అవస్థలు పడుతున్న విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఏ ఒక్క రోజైనా ఆ విద్యార్థుల దగ్గరకు వెళ్లి మాట్లాడావా? కేన్సర్, గుండెపోటు, ప్రమాదాలకు గురైన వారు మెరుగైన చికిత్సలు చేయించుకోవాలంటే రూ.2 నుంచి రూ.3 లక్షలు వెచ్చించాల్సి వస్తే.. ఆ పేదలు ఆ మొత్తాన్ని రూ.3 నుంచి రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చి చికిత్స చేయించుకున్న దుస్థితిపై ఏనాడైనా ఆరా తీశావా చంద్రబాబూ..? తొమ్మిదేళ్లలో రైతుల రుణమాఫీ గుర్తుకు రాలేదా? ఉచిత విద్యుత్ గుర్తుకురాలేదా? ఆ తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియాలా ఎందుకు చేయలేదు? ఓ‌ట్లు, సీట్ల కోసం ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయా? అని చంద్రబాబును నిలదీయండి' అని అన్నారు.

చంద్రబాబు కపట వాగ్దానాలు :
రుణమాఫీ.. ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూ.1.27 లక్షల కోట్ల రుణాలున్నాయని నిర్ధారిస్తే.. చంద్రబాబు మనుషులు టీవీల వద్దకు వెళ్లి ఒకాయన రూ.20 వేల కోట్లు, మరొకరు రూ.30 వేల కోట్లు, ఇంకొకరు రూ.10 వేల కోట్లని చెబుతున్నారు. అంటే రూ. 1.27 లక్షల కోట్లున్న రైతు రుణాలను వీళ్లంతట వీళ్లే, అది అమలు కాక ముందే తక్కువ చేసి చూపిస్తున్నారంటే.. వీళ్ల చిత్తశుద్ధి ఏమిటో ఇప్పుడే అర్థమవుతోంది. చంద్రబాబు చెబుతున్న రైతు రుణ మాఫీకి రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా రుణ మాఫీకి రూ.20 వేల కోట్లు కలిపి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చవుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.1.25 లక్షల కోట్లయితే రూ.1.5 లక్షల కోట్ల రుణాలను ‌ఆయనెలా మాఫీ చేస్తాడని అడుగుతున్నా. రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లుంటే చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని అబద్ధం చెబుతున్నారు. రాష్ట్రంలో అన్నీ కలిపి 20 లక్షల ఉద్యోగాలే ఉంటే.. చంద్రబాబు మాత్రం 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు 65 ప్రభుత్వ సంస్థలను మూయించి 26వేల మందిని నడిరోడ్డున నిలబెట్టిన ఘనుడు చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఒక మాట, అయ్యాక మరో మాట మాట్లాడటం బాబుకు అలవాటే’ అన్నారు.

ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా.. సాగిలపడేది కావాలా?:

'సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొడుతుంటే.. పార్లమెంటులో పూర్తిగా మద్దతిచ్చిన నరేంద్ర మోడీ, చంద్రబాబు.. ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి అయినా తింటారు. వీళ్లెవరికీ మన మీద, మన రాష్ట్రం మీద ప్రేమ లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. చంద్రబాబు నరేంద్ర మోడీకి ఓటేయాలని అడుగుతున్నారు. నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం ఓటేయాలని అడుగుతున్నాను. మనకు ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా? ఢిల్లీకి సాగిలపడే ప్రభుత్వం కావాలా? మీరే నిర్ణయించుకోండి' అని శ్రీ జగన్‌ అన్నారు. 'సీమాంధ్రలోని 25 ఎంపీ సీట్లూ తెలుగుజాతి భవిష్యత్తు కోసం మనమే గెలుచుకుందాం. మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని ఎవరి పట్ల మనకు నమ్మకం కలుగుతుందో ఆ వ్యక్తినే ప్రధానిని చేద్దాం' అని శ్రీ జగన్‌ స్పష్టం చేశారు.

Back to Top