మూడు మాసాల్లో రాష్ట్రంలో అభివృద్ధి విప్లవం

శ్రీకాకుళం:

‌మరో మూడు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి విప్లవం రాబోతున్నదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. మూడు నెలల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, అధికారం చేపట్టిన తొలిరోజే రాష్ట్ర ప్రగతిని మలుపు తిప్పేలా నాలుగు సంతకాలు చేస్తానని, ఆ నాలుగు సంతకాలతో ఆంధ్రప్రదేశ్ గతిని సమూలంగా మార్చివేస్తా‌మని, కొత్త అభివృద్ధి విప్లవం సృష్టిస్తా’మని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో శ్రీ వైయస్ జగ‌న్ ప్రసంగించారు.‌ 'అమ్మ ఒడి' పథకంపై తొలి సంతకం, వృద్ధాప్య పింఛన్లపై రెండవ సంతకం, రైతన్నల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై మూడవ సంతకం, డ్వాక్రా రుణాల రద్దుపై నాలుగవ సంతకం చేస్తానని శ్రీ జగన్ స్పష్టంచేశారు.

శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిప‌ల్ పాఠశాల మైదానంలో ‌జరిగిన ఈ బహిరంగ సభలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. ఆయనతో‌ పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జుత్తు జగన్నాయకులు (పలాస), తైనాల విజ‌య్‌కుమార్ (విశాఖ ఉత్తరం), ఎన్టీఆర్ ‌టీడీపీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, శ్రీకాకుళం జిల్లాలోని 282 మంది సర్పంచ్‌లు, 432 మంది మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. ఈ సభకు హాజరైన అసంఖ్యాక జనవాహినిని ఉద్దేశించి శ్రీ జగన్ ప్రసంగిస్తూ.. అధికారంలోకి రాగానే తాము అమలు‌ చేయబోయే సంక్షేమ అజెండాను ప్రకటించారు.

30 ఏళ్ళు సువర్ణయుగమే:
మూడు నెలల్లో రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఆ తొలిరోజునే రాష్ట్ర ప్రగతిని మలుపుతిప్పేలా నాలుగు ముఖ్యమైన సంతకాలు చేస్తానని శ్రీ జగన్‌ చెప్పారు. తమ బిడ్డలను ధైర్యంగా బడికి పంపించేందుకు అమ్మ ఒడి పథకం ప్రారంభిస్తానన్నారు. ఆ విద్యార్థులను ఇంజనీరు, డాక్టరు, కలెక్టర్ వంటి పెద్ద చదువు‌లు చదివించే ఏర్పాటు చేస్తామన్నారు. బడికి వెళ్లే బిడ్డకు నెలకు రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు బిడ్డలకు నెలకు రూ.వెయ్యి అమ్మ ఖాతాలోనే జమ చేసే పథకం ఫైలుపై తొలి సంతకం చేస్తానన్నారు. వృద్ధాప్య పింఛన్ల ఫైలుపై రెండో చేస్తానని చెప్పారు. అవ్వలు, తాతలకు మనవడిలా తోడుంటానని, వారికి మూడు పూటలా కడుపు నిండేలా వృద్ధాప్య పింఛన్‌ను నెలకు రూ.700కు పెంచుతూ రెండవ ఫైలుపై సంతకం చేస్తానన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడవ సంతకం చేస్తానని శ్రీ జగన్‌ తెలిపారు. డ్వాక్రా మహిళల రుణాలు రద్దుకు నాలుగం సంతకం చేస్తానని చెప్పారు. ఈ నాలుగు సంతకాలతో ఐదేళ్లు కాదు మనం పరిపాలించేది మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో రాజన్న సువర్ణ యుగాన్ని అందిస్తానని శ్రీ జగన్‌ ఉద్ఘాటించారు.

నిరుపేదల కష్టాలను కళ్లారా చూశా :
మన రాష్ట్రంలో ఏ నాయకుడైనా నిరుపేదల పూరి గుడిసెలోకి వెళ్లారా? పేదల కష్టాలు చూశారా? ఓదార్పు యాత్రలో తాను రాష్ట్రంలో 24 వేల కిలోమీటర్లకు పైగా తిరిగి, 700 నుంచి 800 పేద కుటుంబాలను ఓదార్చిన వైనాన్ని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. పేదల గుడిసెల్లోకి వెళ్ళి, వారి బతుకులు అత్యంత సమీపం నుంచే చూశానన్నారు. రాష్ట్రంలో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా రాజన్న సువర్ణ యుగాన్ని తీసుకువచ్చేందుకు ఈ నాలుగు సంతకాలు చేయాలని నిర్ణయించానన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు కాకుండా రెండవ రోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఐదవ సంతకం చేస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని థర్మల్ విద్యు‌త్ కేంద్రాలను రద్దుచేస్తూ ఐద‌వ సంతకం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

బంగారం లాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ చిచ్చు‌:
బంగారం లాంటి రాష్ట్రంలో ఎలా చిచ్చుపెట్టవచ్చో సోనియాగాంధీని చూసి తెలుసుకోవచ్చని శ్రీ వైయస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ప్రధాన ప్రతిపక్షంగా విభజనను ఖండించాల్సిన చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా కాంగ్రెస్‌తోనే కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఒక పక్క సీమాంధ్ర టీడీపీ నేతలతో జై సమైక్యాంధ్ర అని, మరో పక్కన తెలంగాణ నేతలతో జై తెలంగాణ అనిపిస్తారని దుయ్యబట్టారు. జనంలోకి వెళ్లి చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పే చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో జగన్మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఈ రోజు ఆరోపించారన్నారు. కాంగ్రెస్‌తో కుమ్కక్కైంది ఎవరు? చంద్రబాబు కాదా? వైయస్ఆర్ మరణించిన 18 నెలల తర్వాత కాంగ్రె‌స్‌తో కలిసి నాపై అక్రమ కేసులు వేయడం కుమ్మక్కు కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ సహకరించడం కుమ్మక్కు కాదా? ఆర్టీఐ కమిషనర్ పోస్టులను పంచుకోవడం కుమ్మక్కు రాజకీయం కాదా? ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాల కేసులపై సీబీఐ విచారణ జరగకుండా కాంగ్రె‌స్‌తో కుమ్మక్కవ్వడం నిజం కాదా? నేను జైల్లో ఉండి కూడా ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఓటు వేశాను. కానీ బయట ఉండి చంద్రబాబు ఎఫ్‌డీఐలపై ఓటింగ్ ‌సమయంలో తమ పార్టీ రాజ్యసభ సభ్యులు గైర్హాజరు చేసి కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాలేదా? రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని మోపిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోకుండా విప్ జారీ చేసి మరీ కాపాడింది కుమ్మక్కు రాజకీయం కాదా? అని నిలదీశారు.

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చేది? :
రూ.1500 పెడితేగానీ గ్యాస్ సిలిండ‌ర్ రావడం లే‌దని, ఇంటిలోని లైట్‌కు స్విచ్ వేస్తే కరెంటు బిల్లుల షాక్ తగులుతోందని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 133 రోగాలను తొలగించడాన్ని శ్రీ జగన్‌ తప్పుపట్టారు. ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రీయింబర్సుమెంట్ పథకం కింద ఒక్క రూపాయి ఇవ్వలే‌దని ఆయన గుర్తుచేశారు. ఇలాంటి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కనీసం చర్చించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బంగారం లాంటి మన రాష్ట్రాన్ని ఎలా విభజించాలనే దానిపైనే 44 రోజులు అసెంబ్లీలో చర్చించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఫ్యాన్ గాలికి ఆ ముగ్గురూ కొట్టుకుపోవాలి :
వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి సోనియా, చంద్రబాబు, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కొట్టుకుపోయేలా చేతులు తిప్పండని శ్రీ జగన్‌ పిలపునిచ్చారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినప్పుడే రాజీనామా పత్రాన్ని సోనియా ముఖంపై సీఎం కిరణ్ కొట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. విభజనకు కారణమైన సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఈ ముగ్గురూ ప్రజా ఉప్పెనలో కొట్టుకుపోతారని మండిపడ్డారు. శ్రీకాకుళం సభకు ముందు శ్రీ జగన్ విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన సమైక్య శంఖారావం సభలో ప్రసంగించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడ్డారు.

‌ఈ సభలో ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ఇన్‌చార్జి సుజయ కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు.

Back to Top