కుట్రలు, కుతంత్రాలు ఇక కొనసాగవ్

రేణిగుంట (చిత్తూరు జిల్లా):

'సోనియా, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి అన్యాయంగా చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఎక్కువ కాలం కొనసాగవు. ఎప్పటికైనా మంచే గెలుస్తుంది. ఇది చరిత్ర చెప్పిన పాఠం’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నాలుగవ విడత ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర’ పదవ రోజు బుధవారం శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో కొనసాగింది. ఏర్పేడు, రేణిగుంటల్లో జరిగిన బహిరంగ సభల్లో శ్రీ జగన్‌ అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరూ ఆపలేరు. మా ఇష్టానుసారం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తాం’ అనుకుంటున్న సోనియాకు, ఆమె దర్శకత్వంలో నాటకాలాడుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం తప్పదని శ్రీ జగన్‌ హెచ్చరించారు.
‘రాష్ట్రంలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు ఎవ్వరిని కదిలించినా వారి గుండెల నుంచి వచ్చే నినాదం ‘జై సమైక్యాంధ్ర’. రాష్ట్రాన్ని విభజిస్తే ఉద్యోగాల కోసం ఎక్కడకు పోవాలని చదువుకున్న యువకులు ఆందోళన చెందుతున్నారు. వెయ్యి అడుగుల లోతు తవ్వినా బోర్ల నుంచి నీటి జాడ లేని పరిస్థితుల్లో విభజన జరిగితే సేద్యానికి నీళ్లెక్కడంటూ రైతన్న ఘోషిస్తున్నాడు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజల ఘోష మన సీఎంకు వినిపించడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకూ వినిపించడం లేదు. మనం ఈ గడ్డపైన పుట్టామే.. విభజన రాజకీయాలు చేస్తే మనకు ఓట్లేసి గెలిపించిన జనం రేపు మన కాలర్ పట్టుకు‌ని నిలదీస్తారన్న స్పృహ కూడా వీరికి లేకపోవడం మన ఖర్మ' అన్నారు.

మహానేత వైయస్‌ హయాం సువర్ణయుగం :

'ఐదేళ్ల క్రితం సువర్ణయుగం ఉండేది. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత వరకూ మన రాష్ట్రం జోలికి వచ్చే దమ్మూ, ధైర్యం ఎవ్వరికీ లేవు. ఒకే ఒక్క మనిషి లేకపోవడంతో రాష్ట్రంలో ఇంత అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయని జనమంతా ఆ మహానేతను తలచుకుంటున్నారు. అసెంబ్లీ సాగుతున్న తీరు చూస్తే బాధనిపిస్తోంది. ‌ఆయా ప్రాంతాల టీడీపీ సభ్యులతో చంద్రబాబు వారి వారి నినాదాలు చేయిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ సమస్యపై స్పష్టమైన వైఖరి చెప్పలేనివాడు అసలు నాయకుడెలా అవుతాడు? రాష్ట్రంలో ఉన్న నేతలంతా దివంగత సీఎం వైయస్ఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.
ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నడూ మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. రాజకీయాల్లో విశ్వసనీయతకు, నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. అలాంటి నేత మనకు దూరం కావడంతో రాష్ట్రంలో ఇంత అస్తవ్యస్థ పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మనమే సొంతంగా 30 పార్లమెంటు స్థానాలు గెలుచుకుందాం. అప్పుడు మన రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం’ అని శ్రీ జగన్‌ పేర్కొన్నారు.

విశ్వసనీయత అంటే ఏ పేరు గుర్తొస్తోంది? :
చంద్రగిరి నియోజకవర్గం దామినీడు బహిరంగ సభలో శ్రీ జగన్ ప్రసంగిస్తూ.. విశ్వసనీయత, మడమ తిప్పని నైజం అన్న మాటలు విన్నప్పుడు మీకు గుర్తొచ్చే పేరు ఏది అని ప్రజలను ప్రశ్నించారు. జనం పెద్దపెట్టున ‘వై‌యస్.. వైయస్’ అని జవాబిచ్చారు. అలాగే వెన్నుపోటు అన్న మాట విన్నప్పుడు గుర్తుకొచ్చే పేరు ఏదని ప్రశ్నిస్తే.. ‘చంద్రబాబు.. చంద్రబాబు’ అంటూ జనం స్పందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top