జనం జీవితాలతో కేంద్రం చెలగాటం

న్యూఢిల్లీ:

ప్రజల భావోద్వేగాలతో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నాయని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని, విభజన జరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో కనీస అవగాహన లేకుండానే అప్రజాస్వామికంగా ముందుకెళ్తున్నారని తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. విభజించు - పాలించు సూత్రాన్ని అమలుచేస్తూ వీరికంటే బ్రిటిష్ పాలనే నయమేమో అ‌నే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహా మిగతా పార్టీలన్నీ కలిసి రావాలని శ్రీ జగన్‌ పిలుపునిచ్చారు.

వచ్చే మూడు రోజులూ కీలకం అని చెప్పిన శ్రీ జగన్ ‌విభజన విషయంలో ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రతి సమైక్యవాదీ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి కలిసిరావాలని కోరారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ సోమవారం నిర్వహించిన సమైక్య ధర్నాలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రసంగించారు. సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగంలో రాష్ట్ర విభజన తీరును ఎండగట్టారు.

రాష్ట్రం విడిపోతే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండూ నష్టపోతాయని శ్రీ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం పురోగతిలో సాగాలంటే రాష్ట్రంలోని మహానగరాలు, సముద్రాలు కలిసే ఉండాలన్నారు. విమానాశ్రయాలు, ఓడరేవులు కలిసే ఉండాలన్నారు. వాటిని వేరుచేయకూడదని శ్రీ జగన్ పేర్కొన్నారు.

అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం :
‘సమైక్యాన్ని కోరుతూ రాష్ట్రం నలుమూల నుంచి ఢిల్లీ చెవులకు సమైక్యవాదాన్ని వినిపించాలని, మన బాధను, గుండెల్లో నుంచి వస్తున్న ఆవేదనను వీరికి కనిపించేట్లు చేసేందుకు వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు. చలి తీవ్రంగా ఉన్నా లెక్కచేయకుండా ఇక్కడికు వచ్చిన అక్కలు, చెల్లెళ్లు, అన్నా, తమ్ముడూ, అవ్వా, అయ్యలకు చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ రోజు ఢిల్లీకి వచ్చి సమైక్య శంఖారావం పూరించి, విభజనపై కేంద్రం సాగిస్తున్న హేయమైన, అన్యాయమైన విధానాన్ని ప్రశ్నిస్తున్నాం.

ఇలాంటి విభజన చరిత్రలో లేదు :
'దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీలో అధికారం చేతుల్లో ఉందని అన్యాయంగా విభజన చేస్తున్నారు. దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా రాష్ట్రాలను విభజిస్తే అది అక్కడి ప్రజలు, అక్కడి అసెంబ్లీ ‘మమ్మల్ని విభజించండి’ అని చెప్పి ఆమోదముద్ర వేసినప్పుడు మాత్రమే జరిగింది. గత 60 ఏళ్లుగా ఏ ఒక్క రాష్ట్రాన్ని కూడా అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజించిన దాఖలాలు లేవు. ఏ రాష్ట్రాన్ని కూడా అధ్యయన కమిషన్లు సిఫారసు చేయకుండా విభజించలేదు. కానీ మన రాష్ట్రం విషయంలో మాత్రం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సైతం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే అన్నింటికన్నా ఉత్తమమని చెప్పింది. అసెంబ్లీ మొత్తం విభజనకు వ్యతిరేకం, విభజించవద్దని చెప్తూ తీర్మానం చేసింది. అయినా ఢిల్లీలో పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తూ పార్లమెంటులో  బిల్లు పెట్టారు‌'.

ప్రజాస్వామ్యం ఖూనీ :
'పార్లమెంటులో అయినా, అసెంబ్లీలోనైన బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు స్పీకర్ వచ్చి కూర్చున్నాక సంబంధిత మంత్రి ఫలానా బిల్లు ప్రవేశపెడుతున్నామని చె‌బుతారు. బిల్లును ప్రవేశపెట్టేందుకు సభ్యుల అనుమతిని స్పీకర్ కోరుతారు. కానీ గురువారం లో‌క్‌సభలో స్పీకర్ వచ్చిన పది సెకన్లలో‌నే బిల్లు ప్రవేశపెట్టారు. చేతులు పైకి ఎత్తండన్న మాటే నాకైతే వినపడలేదు. ఎవరూ చేతులు పెకైత్తినట్లూ కనిపించలేదు. ఎవరూ ‘అవును బిల్లును ప్రవేశపెట్టటానికి ఒప్పుకుంటున్నాం’ అని సంకేతాలు ఇవ్వలేదు. పార్లమెంటు సాక్షిగా అందరూ చూస్తుండగానే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారు. ఇది అన్యాయమని నేనూ, అద్వానీ, సుష్మాస్వరాజ్, సమాజ్‌వాది పార్టీ నేత, ఏఐడీఎంకే తంబిదొరై, బీజేడీ, జేడీయూ నేతలం కలిసి స్పీకర్ చాంబ‌ర్‌కు వెళ్లి చెప్పాం. ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అక్కడే ఉన్నారు. మేము చేసిన విన్నపాన్ని బేఖాతరు చేస్తూ సభలో బిల్లు ప్రవేశపెట్టేశామని బదులిచ్చారు. నాతో సహా అద్వానీ, సుష్మా, ఇతర నేతలంతా వాకౌట్ చేశాం. అయినా ఎవరూ పట్టించుకోలేదు‌'.

బ్రిటిష్ వారే నయం :
'లోక్‌సభలో బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగేవారు లేరు. అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. నా కళ్ల ముందు ఇంతగా జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పుడూ చూడలేదు. బ్రిటిష్ ‌వారి పాలనా కాలంలోనూ ఇంత అన్యాయాన్ని చూసి ఉండరు. విభజించు - పాలించు తరహాలో వీరు ప్రవర్తిస్తున్నప్పడు బ్రిటిష్ వాళ్లే వీళ్లకన్నా మేలేమో అనిపిస్తోంది.

రైతులు తన్నుకునే పరిస్థితి రాదా? :
రాష్ట్రాన్ని విభజిస్తే రైతుల పరిస్థితి ఏమిటి? కృష్ణానదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర అవసరాలు తీరాక, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యా‌మ్‌లు నిండితే తప్ప నీరు కిందకు రాని పరిస్థితి ఉంది. ట్రిబ్యునళ్లు, వాటర్ బోర్డులు ఉండగానే కొట్టుకునే పరిస్థితి ఉంది. రేపు మధ్యలో మరో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపునీళ్లు తప్పితే మంచి నీరు ఎక్కడ ఉందని అడుగుతున్నా. కృష్ణా ఆయకట్టు కింద 11 జిల్లాలకు నీరందుతుండగా తెలంగాణలోని మహబూ‌బ్‌నగర్, నల్గొండ జిల్లాలో సగభాగం, ఖమ్మం జిల్లాతో పాటు సీమాంధ్రలోని ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని విడగొడితే 11 జిల్లాల రైతులు నీటి కోసం తన్నుకునే పరిస్థితి రాదా? హైదరాబాద్ నుంచి వెళ్లిపొమ్మని సునాయాసంగా అంటున్నారు. 75 % సే‌ల్సు ట్యాక్సు హైదరాబాద్ నుంచే వస్తోంది. రాష్ట్ర బడ్జె‌ట్‌కు 60 % నిధులు, ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. హైదరాబా‌ద్‌ను పక్కనపెడితే తెలంగాణ, సీమాంధ్రల నుంచి 40 శాతం నిధులు, ఆదాయం వస్తున్నాయి. విభజన జరిగితే సీమాంధ్రకు కేవలం 20 శాతం ఆదాయం మాత్రమే ఉంటే వారు ఎలా బతుకగలుగుతారు? ఉన్నత చదవులు పూర్తి చేసిన విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలని కాలర్ పట్టుకొని అడిగితే ‌ఏమి సమాధానం చెబుతారు?

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపుదాం :
అవగాహన లేకుండా ప్రజల జీవితాలతో ఓట్లు, సీట్లు కోసం చెలగాటం ఆడుతున్నారు. ఈ అడ్డగోలు విభజనపై కేంద్రం తీరును ఎండగట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటికావాలి. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు, బీజేపీకి వంద పైచిలుకు స్థానాలున్నాయి. వీరిద్దరి సీట్లు కలిస్తే మూడు వందల స్థానాలున్నాయి. ఈ సందర్భంగా బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నిజమైన ప్రతిపక్ష పార్టీగా ముందుకు రండి. ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కలుపుకొని కాంగ్రె‌స్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుదాం. రానున్న మూడు రోజులు మన రాష్ట్రానికి చాలా కీలకం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క సమైక్యవాదిని కోరుతున్నా. మనలో ఉన్న ‌భేదాభిప్రాయాలు పక్కనపెడదాం. అందరం కలిసి బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలపై ఒత్తిడి తెచ్చి అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకుందామని పిలుపునిస్తున్నా. రేపు ఇక్కడ సమైక్య ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో మనం కూడా పాల్గొని వారు మనవాళ్లే అని చెప్పి కలిసికట్టుగా పోరాడదాం’ అని పిలుపునిచ్చారు.

Back to Top