అసెంబ్లీలో చర్చల తీరు ఇదేనా!

వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా) : ‘దివంగత మహానేత వైయస్ఆర్ బతికి ఉన్నంతవరకూ ఈ రాష్ట్రం‌ వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ రాలేదు. ఆయన మన నుంచి దూరమయ్యాక ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్రకు తెర లేచింది. ఈ కుట్రలు ఎంతో కాలం సాగవు. మహానేత వైయస్ఆర్‌ను అభిమానించే ప్రతి గుండె ఒక్కటవుతుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో పెను ఉప్పెన సృష్టిస్తుంది. ఆ ఉప్పెనలో విభజన కుట్రదారులు కొట్టుకుపోవడం ఖాయం’ అని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో శ్రీ జగన్ ‘సమైక్య శంఖారావం, ఓదార్పు యూత్ర’ నాలుగవ విడత 8వ రోజు సోమవారం సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగించారు. వరద‌య్యపాళెంలో జరిగిన బహిరంగ సభలో శ్రీ వైయస్ జగన్ ప్రసంగించారు.‌

నమ్ముకున్న వారినే అమ్మేస్తారు :

‘మహానేత మనకు దూరమయ్యాక రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించే నాయకుడే కరవయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లో విశ్వసనీయతకు అర్థం తెలియని వారు అధికార, ప్రతిపక్షాల్లోనూ ఉన్నారు. నమ్ముకున్న వారినే సీట్లు, ఓట్ల కోసం అమ్మేసేందుకు కూడా వెనుకాడని ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే బాధనిపిస్తోంది’ అని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రజా సమస్యలపై కాదు విభజనపై అసెంబ్లీలో చర్చ :
‘రాష్ట్ర అసెంబ్లీలో 44 రోజులుగా జరుగుతున్న చర్చ పేదవారి సమస్యలపై కాదు. ఈ రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేయాలా అనే అంశంపై నడుస్తోంది. గ్యాస్ డీల‌ర్ దగ్గరకు వెళితే బ్యాంకుకు వెళ్ల‌మంటున్నాడు. బ్యాంకుకు వెళితే గ్యాస్ డీల‌ర్ వద్దకే ‌పొమ్మంటున్నారు. రూ.1,500 పెడితే కానీ గ్యాస్ సిలెండ‌ర్ అందని దుస్థితి ఉందని అక్కా చెల్లెళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అసెంబ్లీలో చర్చ లేదు. కరెంటు బిల్లు చూస్తే షాక్ కొడుతోంది. బిల్లు ఎంత ఉందో మళ్లీ అంత మొత్తాన్ని స‌ర్‌చార్జీల పేరుతో బాదేస్తున్నార'ని శ్రీ జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘ఆరోగ్యశ్రీ’ నుంచి 133 జబ్బులను తీసేశారు. చిన్న పిల్లల మూగ, చెవుడు చికిత్సకు అవసరమయ్యే ‘కాక్లియర్ ఇంప్లాంట్’ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ నుంచి తీసేశారు. ఈ ఆపరేషన్ చేయించకపోతే ఆ పిల్లలు జీవితాంతం మూగవారిగానే మిగిలిపోతారు. ఇలాంటి జబ్బులను ఆరోగ్యశ్రీ నుంచి తీసేస్తే దీనిపైనా అసెంబ్లీలో చర్చ జరగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.. విద్యా సంవత్సరం పూర్తికావస్తున్నా ఇంతవరకూ ఫీజు బకాయిలు చెల్లించలేదు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశంపైనా అసెంబ్లీలో చర్చ జరగడం లేదని ఆయన దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top