ఇంకెన్నాళ్లీ దుష్టపాలన..!

శ్రీకాకుళంః వైఎస్సార్సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇంకెన్నాళ్లు దుష్టపాలన కొనసాగిస్తావని మండిపడ్డారు.  చంద్రబాబు పాలన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని కృష్ణ దాస్ అన్నారు. అసలు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా సాధన  కోసం ఢిల్లీ మొదలుకొని రాష్ట్రంలో గల్లీగల్లీ  అందరినీ ఐక్యం చేస్తూ తమ అధినేత వైఎస్ జగన్ పోరాడుతుంటే ..చంద్రబాబు దాని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. బాధ్యతగా ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేస్తుంటే సమర్థించాల్సింది పోయి అడ్డుకోవడం దారుణమన్నారు.  

మీరు గతంలో ధర్నాలు,దీక్షలు చేయలేదా అని కృష్ణదాస్ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంమీదగానీ, ప్రతిపక్షం మీద గానీ, సమర్థవంతమైన నాయకత్వం మీదగానీ చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నంటిలో అంతా అవినీతేనని విమర్శించారు. ఎంతో ప్రయోజనం ఉన్న పోలవరం లాంటి ప్రాజెక్ట్ లను కాదని, హడావుడిగా  పట్టిసీమను తీసుకొచ్చారు. పట్టిసీమలో మీరు, మీకోటరీకి భాగమెంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అమాయకులు కాదని , త్వరలోనే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని కృష్ణదాస్ హెచ్చరించారు. దీక్షను అడ్డుకుంటే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 
Back to Top