రాష్ట్రానికి ప్రత్యేకహోదాయే సంజీవని..!

పరిశ్రమలైనా,ఉద్యోగాలైనా అన్నీ హోదాతోనే..!
రాయితీలిస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయి..!

రాష్ట్రానికి ప్రాణవాయువులాంటి ప్రత్యేకహోదా. ఉద్యోగాలైనా, పరిశ్రమలైనా, పన్నురాయితీలైనా ఇలా ఏదైనా ప్రత్యేకహోదాతోనే సాధ్యమవుతాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకహోదా రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్లు 90 శాంతం వస్తాయి. 10 శాతం మాత్రమే లోన్ వస్తుంది. గ్రాంట్ల ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనక్కర్లేదు. లోన్ ద్వారా ఐతే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 

కేంద్రం నుంచే 90 శాతం రుణాలు..!
రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల నిర్మాణం, మెట్రో రైళ్ల ఏర్పాటు, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ లాంటివి చేపట్టాలంటే రూ.వేల కోట్లు అవసరముంటుంది. ఇందుకోసం విదేశీ ఏజెన్సీల నుంచి రుణసాయం పొందాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా ఉంటే కేంద్రమే 90 శాతం రుణాలు గ్రాంట్ గా ఇవ్వడంతో పాటు వడ్డీ కూడా భరిస్తుంది. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి నీటి పథకాలు, విశాఖ-చెన్నైపారిశ్రామిక కారిడార్ , విజయవాడ,విశాఖలో మెట్రో రైళ్లు విభజన చట్టంలోని హామీలే. ఇవన్నీ నెరవేరాలంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంతో ఆవశ్యం. హోదా దక్కకపోతే పెట్టుబడులు రాక, ఉద్యోగాలు లేక గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

రాయితీలిస్తే రెక్కలు కట్టుకు వస్తారు..!
ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇస్తారు.100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఇన్ కమ్ ట్యాక్స్ లో కూడా 100 శాతం రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపులు, ప్రైట్ రీయింబర్స్ మెంట్ లు దక్కితే... పారిశ్రామికవేత్తలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతారు. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగఅవకాశాలు సమకూరుతాయి. పదేళ్ల ప్రత్యేకహోదాతో ఏపీలోని 13 జిల్లాలు ఒక్కో హైదరాబాద్ గా మారతాయి. అప్పుడు ప్రతికంపెనీ నిరుద్యోగుల కోసం వాంటెడ్ బోర్డులు పెట్టేస్తాయి. అదేవిధంగా పన్నురాయితీలు, ప్రోత్సహకాల వల్ల మనం కొనుగోలు చేస్తున్న అనేక వస్తువుల ధరలు సగానికి తగ్గుతాయి. 

హోదాతోఎంతో మేలు..! 
ప్రత్యేకహోదా ఇవ్వడం వల్ల ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు వచ్చాయి. తద్వారా ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. మన కంటే వెనకబడిన రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేకహోదా వల్ల 10 వేల పరిశ్రమలు వచ్చాయి. అలాంటిది 5 కోట్ల ప్రజానీకం గల 972 కి.మీ. సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తే అది పెద్ద సంజీవనే అవుతుంది. ప్రత్యేక హోదా సర్వరోగ నివారిణి కాదని, సంజీవని కాదని ఇలా పాలకులు రకరకాలుగా మాట్లాడడం వల్ల ఇప్పటికే జరగరాని ఘోరాలు జరిగిపోయాయి. ప్రత్యేకహోదా కోసం ఐదుగురు మరణించినా అధికారనేతలు ప్రత్యేకహోదా ప్రయోజనాలను కాలదన్నుతున్నారు. పాలకుల చేతిలో అన్యాయమైపోతున్న రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకహోదా కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. 
Back to Top