కేసులకు భయపడి హోదాను నీరుగార్చారు

ప్యాకేజీతో బాబు జేబులు నిండుతాయి
ఎమ్మెల్యే వై. ఐజయ్య 
కర్నూలు: కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో చంద్రబాబు, ఆయన కోటరి జేబులు నిండుతాయి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నందికోట్కూరి ఎమ్మెల్యే వై. ఐజయ్య విమర్శించారు. హోదా వల్ల ఏం ఉపయోగం అని కేంద్రమంత్రి వెంకయ్య, చంద్రబాబులు మాట్లాడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కర్నూలులో నిర్వహించిన చైతన్యపథం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు.  రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరాలంటే కచ్చితంగా హోదా రావాల్సిందేనని స్పష్టం చేశారు. క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌లో 90 శాతం రాయితీగా వస్తుందని.... 10 శాతం మాత్రమే  కేంద్రం అప్పుగా ఇస్తుందన్నారు. ఆంధ్రరాష్ట్ర యువత భవిష్యత్తు హోదాతో ముడిపడివుందన్నారు. ప్రజల  భవిష్యత్తును మార్చే హోదాను కాలరాసి ప్యాకేజీని ప్రకటించగానే స్వాగతించడానికి హోదా మీ అబ్బసొమ్మా అని ప్రశ్నించారు. ప్యాకేజీ రాగానే నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు మాటలను ఐజయ్య తప్పబట్టారు. కష్టపడి చదువుకుంది మీరిచ్చే రెండువేల భృతి కోసమా అని నిలదీశారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో హోదాను పోరాడి సాధించుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. 

కేసుల కోసం బాబు వెనుకడుగు
ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కర్నూలు: ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు కేసు నుంచి బయటపడడం కోసం కేంద్రం దగ్గర హోదా ఊసే ఎత్తడం లేదని కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. చైతన్యపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అధికారంలోకి రాగానే హోదా ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు అవకాశం లేదని దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా గత ప్రధాని ప్రకటించిన హోదాను తరువాతి ప్రభుత్వాలు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, రాయితీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కేసుల కోసం భయపడి హోదా పోరాటాన్ని నీరుగారుస్తున్న బీజేపీ, టీడీపీలను యువత క్షమించరని హెచ్చరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా సంఘాల మద్దతుతో పోరాడి హోదా సాధించుకుంటామని స్పష్టం చేశారు. 
 
వెంకయ్య, బాబు పదవులకు రాజీనామా చేయాలి
వైయస్‌ఆర్‌ సీపీ నేత రామయ్య
కర్నూలు: హోదా నెపంతో ఎన్నికల్లో గెలిచి..ఆ తరువాత మాట తప్పుతున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడులకు పదవుల్లో కొనసాగే అర్హత లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ధ్వజమెత్తారు. కర్నూలు చైతన్యపథం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.  మాట తప్పిన నాయకులు తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. హోదా పేరు చెప్పి ఓట్లేయించుకొని ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాలుగా హోదా కోసం పోరాడుతున్నామని ఇప్పుడు హోదా గొప్పది కాదని మాట్లాడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 
Back to Top