ఏపీకి ప్రత్యేకహోదాయే సంజీవ‌ని

- ప్ర‌త్యేక హోదా కోసం యువ‌త పిడికిలి బిగించాలి
- ప్యాకేజీ వ‌ల్ల లోకేష్‌కు సూట్‌కేట్‌లు అందుతాయి
- దాని వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉప‌యోగం లేదు
-హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం..ప్రతి ఒక్కరూ పోరాడాలి
- వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి

తిరుపతి: పార్లమెంట్, తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. హోదా ఐదేళ్లు కాదు... ప‌దేళ్లు కావాల‌ని పార్ల‌మెంట్ సాక్షిగా నినాదించార‌ని... బీజేపీ, టీడీపీలు క‌లిసి వాడ‌వాడ‌లా ఇంటింటికి ప్ర‌త్యేక హోదా గురించి కరపత్రాలు పంచార‌ని... అసెంబ్లీలో సైతం హోదా కోసం తీర్మానాలు చేశార‌ని మ‌రి అవన్నీ ఏమైపోయాయని నిలదీశారు.  ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని చెవిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒక్క కేసుతో రాష్ట్ర ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు గంగ‌లో క‌లిసిపోయింద‌ని చెవిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. కేసు నుంచి త‌ప్పించుకుంటే ప్యాకేజీ వ‌స్తుంద‌న్న ఆశ‌తో టీడీపీ ప్ర‌భుత్వం బీజేపీతో కుమ్మ‌క్కైంద‌న్నారు. ప్యాకేజీ వ‌ల్ల సూట్‌కేస్‌లు వ‌స్తాయ‌ని, ఆ సూట్‌కేస్‌ల‌ను లోకేష్ అందించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్నార‌ని ఆరోపించారు. 

ప్ర‌త్యేక హోదా రాష్ట్రం, యువ‌త భ‌విష్య‌త్తుకు సంబంధించిన విష‌యమ‌న్నారు. ప్రత్యేక హోదా వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌త్యేక హోదా ఉంటే డ‌బ్బు ఉన్న పారిశ్రామిక వేత్త‌లు ప‌రిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్ప‌డానికి ముందుకు వ‌స్తార‌న్న విష‌యం అంద‌రూ తెలుసుకోవాలన్నారు. వ్యాపారాలు చేసేందుకు ఎక్క‌డైతే ఎక్కువ అవ‌కాశాలు, వాణిజ్యాలు, ఖ‌నిజాలు, సౌక‌ర్యాలు ఉంటాయో అక్క‌డే కంపెనీలు నెల‌కొల్పేందుకు ఆస‌క్తి చూపుతార‌ని పేర్కొన్నారు.  ప్ర‌త్యేక హోదా సాధించిన ఉత్త‌రాఖండ్ లో35వేల కోట్లు పెట్టుబ‌డులతో 32వేల ప‌రిశ్ర‌మ‌లు ఏర్ప‌డ్డాయ‌ని, రెండున్న‌ర ల‌క్ష‌ల మంది సంపాధించుకున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా ఉన్న హిమ‌చ‌ల్‌ప్ర‌దేశ్‌లో  రెండున్న‌రేళ్ల‌లో 14వేల ప‌రిశ్ర‌మ‌లు ఏర్ప‌డ్డాయ‌ని  చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వివరించారు. చైత‌న్య ప‌థం కార్య‌క్ర‌మానికి హాజరైన సందర్భంగా ఆయ‌న మాట్లాడారు. ప్ర‌త్యేక ప్యాకేజీ అనేదీ అప్ప‌టికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డేద‌ని, ప్ర‌త్యేక హోదా అనేదీ ప్ర‌జ‌ల‌కు జీవితంతాం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. 

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పార్టీ 
కొంద‌రు నాయ‌కులు విమ‌ర్శించిన‌ట్లు  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పిల్ల కాంగ్రెస్ పార్టీ కాద‌ని వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ... వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్క‌ర‌రెడ్డి నొక్కి వక్కానించారు. తామంద‌రం వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వార‌సులం... వైయ‌స్ రాజశేఖ‌ర‌రెడ్డి పార్టీ మ‌నుషుల‌మ‌న్నారు. 

పైన బీజేపీ... కింద డీజీపీ ఉంటే చాలు...
టీడీపీ వైఖ‌రి.... పైన బీజేపీ, కింద డీజీపీ ఉంటే చాల‌న్న చందంగా మారింద‌న్నారు. పైన బీజేపీ ఉంటే బాబు కేసుల నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌ని, కింద డీజీపీ ఉంటే న్యాయం కోసం పోరాడే నాయ‌కుల‌తో పాటు విద్యార్థుల‌ను సైతం జైలులో పెట్టొచ్చ‌న్న ధోర‌ణి చంద్ర‌బాబులో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంద‌ని విమ‌ర్శించారు. 14 ఫైనాన్స్ క‌మీష‌న్ ఒప్పుకోద‌ని చెప్పుతున్నార‌ని 14ఫైనాన్స్ క‌మీష‌న్ డిసెంబ‌ర్ 31 2014వ‌ర‌కు ఉంద‌న్నారు. మ‌రి ప్ర‌త్యేక ప్యాకేజీకి 14 ఫైనాన్స్ క‌మీష‌న్ ఎలా ఒప్పుకుంటుంద‌ని చెవిరెడ్డి ప్రశ్నించారు. 14ఫైనాన్స్ క‌మిష‌న్ మోడీని ప్ర‌ధాన‌మంత్రి చేసిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వొద్ద‌ని తాము చెప్ప‌లేద‌ని 14ఫైనాన్స్ క‌మిష‌న్ వివ‌రించింద‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి త‌మ‌కు ఎటువంటి ఇబ్బంది లేద‌ని భార‌త‌దేశంలో ఉన్న 12 ప్ర‌ధాన పార్టీలు బిల్లుకు ఆమోదం తెలిపాయ‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌త్యేక హోదా అనేది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నిజంగానే సంజీవ‌ని అని అన్నారు. ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌తి ఒక్క‌రు పోరాడాల‌న్నారు. యావ‌త్ యువ‌త మొత్తం ప్ర‌త్యేక హోదా కోసం ఒక్క‌సారి పిడికిలి బిగించి ముందుకు న‌డిస్తే ప్ర‌త్యేక హోదా ఆంధ్రప్ర‌దేశ్ కాళ్ల వ‌ద్ద‌కు వ‌స్తుంద‌న్నారు. 
Back to Top