ప్రత్యేకహోదాను ఎగతాళి చేస్తున్నారు

హోదాను మరుగునపడేస్తున్న చంద్రబాబు
వెలగపూడి: 5 కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజలు సంజీవనిగా భావించే ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చకు రానివ్వకపోవడం దుర్మార్గమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. హోదాపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి, వేడుకోలు చేసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..  ఒకసారి సంజీవని అని, మరోసారి హోదా వల్ల ప్రయోజనాలుండవని ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పదుల సార్లు మాటలు మార్చారని గుర్తు చేశారు. విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్ర రాష్ట్రానికి హోదా లేకపోతే అన్ని విధాలుగా నష్టపోతుందని, ఉద్యోగాలు, పరిశ్రమలు రావని వైయస్‌ఆర్‌ సీపీ అసెంబ్లీలో గళమెత్తి చర్చకు పట్టుబట్టిందని చెప్పారు. హోదాపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. హోదాను మరుగున పడేసేందుకు చంద్రబాబు సర్కార్‌ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. 
–––––––––––––
ప్రజల కోసం పనిచేస్తాం
వెలగపూడి: మేం జీతాల కోసం పనిచేసే వాళ్లం కాదు.. ప్రజల కోసం పనిచేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనపై ప్రతిపక్షం మాట్లాడితే జీతాలు కట్‌ చేస్తామంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద నారాయణస్వామి మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని తిట్టేందుకు చంద్రబాబు తన సభ్యుల్లో పదిమందిని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడే సభలా లేదని, ప్రతిపక్షంపై తిట్లపురాణంలా ఉందని ఎద్దేవా చేశారు. కులమంత, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా ప్రజల అభివృద్ధికి కృషి చేసిన వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సభను సజావుగా జరగనివ్వకుండా టీడీపీ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు సభను వాయిదా వేయాలని స్పీకర్‌కు ఆదేశాలిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ సభా సాంప్రదయాలను పూర్తిగా మంటగలుపుతోందని ఆరోపించారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు తీసేశారన్నారు. ప్రజల తీర్పుతో గెలిచి కూడా ఓడిన వాళ్లలా ఉండాల్సివస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయలేని దుస్థితి నెలకొందన్నారు. 
...........................................
హోదాను అవహేళన చేస్తున్న బాబు సర్కార్‌
వెలగపూడి: అసెంబ్లీలో ప్రత్యేక హోదా విషయాన్ని చంద్రబాబు సర్కార్‌ సభ్యులు అవహేళన చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌బాషా ధ్వజమెత్తారు. హోదాపై సభలో సమగ్ర చర్చ జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాయిదా తీర్మాణం ఇస్తే స్పీకర్‌ దాన్ని రిజక్ట్‌ చేశారని దుయ్యబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ హోదా వస్తే బతుకులు బాగుపడతాయని ఆశతో ఎదురు చూస్తున్న 5 కోట్ల మంది ఆకాంక్షను కించిపరిచే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చిన టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలుగుదేశం అభ్యర్థిని ఒక్క చోట కూడా గెలిపించలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పు ఇచ్చారని చెప్పారు.  చంద్రబాబు స్వాగతించిన ప్యాకేజీ వల్ల చంద్రబాబు కుటుంబానికి తప్ప ఏ ఒక్కరికి ఉపయోగం లేదని దుయ్యబట్టారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలంతా హోదా సాధన కోసం ముందుకు రావాలని సూచించారు. 
Back to Top