వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన

– మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా
– 9,10 డివిజన్లలో కార్యక్రమం ప్రారంభం

కడప కార్పొరేషన్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా తెలిపారు. బుధవారం స్థానిక 9వ డివిజన్‌లోని గంగమ్మ గుడి, 10వ డివిజన్‌లోని ఎన్‌జీఓ కాలనీలో వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి వైయస్‌ఆర్‌ పథకాలు, ఎన్నికల హామీల అమలుపై సీఎం చంద్రబాబు అనురిస్తున్న వైఖరిని వివరించారు. వారిచే 9121091210 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇప్పించి, సభ్యత్వం రశీదు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ వైయస్‌ఆర్‌ కుటుంబంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. కడప నగరపాలక సంస్థకు నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, బీపీఎస్‌ నిధులు కూడా ఇవ్వకుండా తనవద్దే ఉంచుకుందన్నారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు విడుదల చేశారన్నారు. రేషన్‌ షాపుల్లో కిరోసిన్, చక్కెర, కందిబేడలు ఇవ్వకుండా బియ్యం మాత్రమే ఇస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతు రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీతోపాటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని కూడా విడిపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. అర్హులైన వారందరికీ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టిస్తామని చెప్పి, ఒక్క ఇల్లుగానీ, ఒక్క సెంటు స్థలం కానీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వస్తే వైయస్‌ఆర్‌ కుటుంబంలోని సభ్యుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, 9, 10 డివిజన్ల వైయస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జులు మల్లికార్జున కిరణ్, మల్లికార్జున, బోలా పద్మావతి, చినబాబు, బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, మురళీ పాల్గొన్నారు.

Back to Top