జగన్‌కు బెయిల్ కోసం ప్రత్యేక ప్రార్థనలు

హైదరాబాద్, 23 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ ‌రావాలని కోరుతూ  కడప పెద్ద దర్గాలో ముస్లిం సోదరులు సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్‌, టిడిపిలు ఎన్నికుట్రలు‌, కుతంత్రాలు చేసినా.. శ్రీ జగన్ బయటకు రావడం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తంచేశారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు శ్రీ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. చంద్రబాబుకు పదవీ కాంక్ష తప్ప ప్రజా శ్రేయస్సు పట్టడం లేదని ముస్లిం సోదరులు దుమ్మెత్తిపోశారు.

మరో పక్కన చిత్తూరు జిల్లా కాణిపాకంలో కూడా శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్పై విడుదల కావాలంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వి‌నాయకుడికి కొబ్బరికాయలు కొట్టారు. పలువురు వైయస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆలయంలో మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్ళి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. శ్రీ జగన్‌కు బెయిల్ రావాలని కోరుతూ భద్రాద్రి ఆలయంలో అభిమానులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని ఖమ్మం జిల్లా భద్రాచలం వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యువ నాయకులు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు  నిర్వహించారు.

ఇక గుంటూరు జిల్లా పొన్నూరులో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకుడు రావి వెంకటరమణ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మహానేత వైయస్ఆర్ పథకాలు అమలు కావాలన్నా, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకు రావాలని అభిమానులు ప్రార్ధనలు చేశారు. శ్రీ వైయస్ జగ‌న్ బెయిల్‌పై విడుదల కావాలంటూ నెల్లూరు జిల్లా కావలిలో ముస్లిం మహిళలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గౌరవరం మసీదు నుండి కావలి జెండా చెట్టు మసీదు వరకు పాదయాత్ర చేశారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఇలా ఉండగా..‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై ఈ నెల 18న ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సిబిఐ దర్యాప్తు పూర్తయినందున శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ‌ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తుచేశారు. బెయి‌ల్ అనేది ప్రాథమిక హ‌క్కు అని.. వ్యక్తిపై ఆధారపడి బెయిల్ నిరాకరించడం తగదని చెప్పడంతో‌ పాటు విచారణలో తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు నిందితుడికి బెయి‌ల్ మంజూరు చే‌యవచ్చు అంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను శ్రీ జగన్ తరపు న్యాయవాది వాదనల సందర్భంగా ప్రస్తావించారు.

బెయి‌ల్ ఇచ్చిన తర్వాత సాక్షులను ప్రభావితం చేశారని భావిస్తే... బెయిల్‌ను రద్దు చేయవచ్చని కూడా శ్రీ జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని... రాజకీయ నాయకులు సిబిఐ డైరెక్టర్‌ను కలుస్తున్నారని కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకువచ్చారు. ఏ ప్రాతిపదికన శిక్ష విధించమని కోరుతున్నారో అర్థం కావడం లేదని విచారణ సందర్భంగా న్యాయవాది వివరించారు. వాదనలు పూర్తయినందున కోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Back to Top