ఫిరాయింపుదారులపై స్పీకర్ చర్య తీసుకోవాలి

చంద్రబాబు నిసిగ్గుగా ఫిరాయింపులకు పాల్పడ్డారు
అనర్హులుగా ప్రకటించకపోతే ప్రజాతీర్పును అవమానించడమే
ప్రతిపక్ష సభ్యలుపై కుట్రలు చేయడం మానుకోండి
వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి, సురేష్‌

హైదరాబాద్‌: విజయవాడ తాత్కాలిక అసెంబ్లీ భవనంలోనైనా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు సభను సభా సాంప్రదాయాల ప్రకారం నడిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వై. విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. ఈ సందర్భంగా... నూతన శాసనసభ భవనంలోకి వెళ్తున్న సందర్భంలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసే పరిస్థితులు ఏర్పడటానికి కారణం స్పీకర్‌ కోడెలనేనని చెప్పారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి ఫిరాయింపులకు పాల్పడినా స్పీకర్‌ ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోవడం మూలంగా వైయస్‌ జగన్‌ బహిరంగ లేఖ రాశారని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిసిగ్గుగా బహిరంగంగా వీడియోలు, కెమెరాల ముందు కనిపిస్తూ ఫిరాయింపు దారులకు పచ్చకండువాలు కప్పుతున్నా స్పీకర్‌ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు. 

తల్లిలాంటి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పదే పదే డిమాండ్‌ చేసినా స్పీకర్‌ నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదన్నారు. చివరకు కోర్టులను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా స్పీకర్‌కు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అది చట్టంలోనే ఉందని చెప్పారు. ఇప్పటికైనా తాత్కాలిక అసెంబ్లీలోకి అడుగుపెట్టే ముందు ఆ 21 మంది ఎమ్మెల్యేలపై చట్టసభలోకి అనర్హులుగా తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను పరిగణలోకి తీసుకొని తక్షణమే స్పందించాలని స్పీకర్‌ను కోరారు. ఫిరాయింపు దారులపై చర్చలు తీసుకొని సభలోకి అడుగుపెడితే గౌరవప్రసదంగా ఉంటుందని సూచించారు. 

ప్రజాస్వామ్య పద్దతిలో సభ నడిపించాలి
కొత్త అసెంబ్లీ భవనంలో ప్రజాసమస్యలపై చర్చలు జరిగే విధంగా ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు స్పీకర్‌ను కోరారు. హైదరాబాద్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష గొంతు నొక్కేయడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రస్తావించే ప్రతిపక్ష సభ్యులను అవమానించడం, రోజా లాంటి ఎమ్మెల్యేలను సభ నుంచి సంవత్సరం సస్పెండ్‌ చేశారని, కనీసం కొత్త అసెంబ్లీ భవనంలోనైనా ఇలాంటి ఘటనలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రజలను అనేక సమస్యలు పట్టిపీడుస్తున్నాయని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి అంశాలపై సభలో చర్చ జరిగేందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలన్నారు. గత సమావేశాల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడిన ప్రతిపక్ష సభ్యులపై ప్రభుత్వం ఏదో కుట్ర జరుపుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు మానుకొని ప్రజాస్వామ్య పద్దతిలో సభను సజావుగా గడిచే విధంగా అసెంబ్లీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. 
Back to Top