అనర్హత వేటు వేశాకే అసెంబ్లీకి వస్తాం

  • పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలి
  • నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయాలి
  • వేటు పడే వరకు అసెంబ్లీ సెషన్స్‌ బహిష్కరణ
  • సమావేశంలో వైయస్ఆర్ సీఎల్పీ నిర్ణయం 
  • శాసనసభ బులిటెన్‌లో ఫిరాయింపుదారులను ప్రతిపక్షంలో చూపించడం దారుణం
  • ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని సమావేశాలు బాయ్ కాట్‌
  • ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌లను కలుస్తాం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
హైదరాబాద్‌: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేస్తేనే అసెంబ్లీకి సమావేశాలకు వస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన వైయస్ఆర్ సీఎల్పీ సమావేశం అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా నవంబర్‌ 10వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సభకు మనం హాజరు కావాలా..? వద్దా..? ప్రతిపక్ష పాత్రను ఏ విధంగా పోషించాలనే విషయాలపై వైయస్‌ జగన్‌ పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారన్నారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, అందులో నలుగురు మంత్రులను బర్తరఫ్‌ చేయాలని ఎమ్మెల్యేలంతా అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే సభకు దూరం
శాసనసభ బులిటెన్‌లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు 66 మంది ఉన్నారని, వారిలో నలుగురు మంత్రులు ఉన్నారని చూపించడం అప్రజాస్వామికమని పెద్దిరెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకొని వైయస్‌ఆర్‌ సీపీ పోటీ చేసిందా... అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారిపై అనర్హత వేటు వేయకుండా సమర్ధించడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు ఫిరాయింపు మంత్రులు సమాధానం చెప్పడం.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉండడంతో సభకు దూరంగా ఉండాలని భావించామన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా జరిగిన శాసనసభల్లో ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను, సభ్యులను అనేక సందర్భాల్లో బాబు కించపరిచేలా మాట్లాడారన్నారు. సమస్యలపై చర్చించేందుకు ఎన్ని సార్లు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై ప్రతిపక్షనేత ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే అకారణంగా మైక్‌ కట్‌ చేశారని గుర్తు చేశారు. 

వైయస్‌ఆర్‌ హయాంలో 156 రోజులు సభ జరిగింది
నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం కేవలం 80 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందని పెద్దరెడ్డి అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో 16 సెషన్స్‌లో 156 రోజులు సభ నిర్వహించారని గుర్తు చేశారు. సభను పూర్తి స్థాయిలో జరపాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని, జరిపిన అతి తక్కువ రోజుల్లో ప్రతిపక్ష సభ్యులను, వైయస్‌ఆర్‌ను తిట్టే కార్యక్రమాలే చేస్తున్నారన్నారు. 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి, మంత్రులను బర్తరఫ్‌ చేస్తే సభకు రావడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అది జరగని పక్షంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా అపహాస్యం అవుతుందో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌లను కలిసి వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపడాలని సూచించారు. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు, తమిళనాడులో జయలలిత కూడా సమావేశాలను హాజరుకామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని అసెంబ్లీ సెషన్స్‌ బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. 
Back to Top