స్పీకర్‌ ఆదేశాల మేరకే దాడులు

రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోంది
కోడెల తనయుడే దాడులు చేయించారు
ఏ హక్కుతో ఆయన అధికారం చెలాయిస్తున్నాడు
నల్లపాటికి ఏం జరిగినా  అగ్నిగుండమేః వైయస్సార్సీపీ నేతలు

గుంటూరు (నరసరావుపేట): స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకే ఆయన తనయుడు శివరామకృష్ణ నల్లపాటి కేబుల్‌ విజన్‌ (ఎన్‌సీవీ)పై  దాడులు చేయించారని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్‌సీవీ ఛానల్ పై దాడికి నిరసనగా వైయస్సార్సీపీ శ్రేణులు పట్టణంలో బంద్‌ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు మ్రరిరాజశేఖర్, గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా, నగర అధ్యక్షుడు లేళ్లఅప్పిరెడ్డి, వినుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొల్లా బ్రహ్మనాయుడులతో కలిసి గోపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... శివరామకృష్ణ ఏ హక్కు, అధికారంతో నరసరావుపేట నియోజకవర్గంలో అధికారం చెలాయిస్తున్నాడని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా అవినీతి, దందాలు తప్పితే వారు ప్రజలకు చేసిందేమీలేదన్నారు.. బియ్యం, ఇసుక మాఫియాలు యథేచ్చగా నిర్వహిస్తున్నారన్నారు. ఎన్‌సీవీ కార్యాలయంపై ఉద్దేశ్యపూర్వకంగా దాడిచేసి యజమానులైన నల్లపాటి రాము, లాంకోటేశ్వరరావులపై 307సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు పెట్టించారన్నారు. నల్లపాటి రాముకు ఏం జరిగినా నరసరావుపేట అగ్నిగుండంగా మారుతుందన్నారు. 

తాము ప్రశాంతంగా బంద్‌ చేయాలని నిర్ణయించుకుంటే పోలీసులు తమను కట్టడి చేసి షాపుల వద్దకు కూడా పోనీయకుండా ప్రదర్శన మాత్రమే చేయనిచ్చారన్నారు. పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో హిట్లర్‌ పాలన సాగుతుందనిపిస్తోందన్నారు.  గతంలో గ్రామీణ కేబుల్‌ విజన్‌పై దాడిచేసిన వారే ఇప్పుడు ఎన్‌సీవీపై దాడిచేశారని, ప్రైవేటు ఆస్థులకు రక్షణలేకుండా పోతుందన్నారు. విధిలేక తాము బంద్‌కు పిలుపునిస్తే ఆ బంద్‌ను విఫలం చేసేందుకు గ్రామాల నుంచి పట్టణంలోకి కార్యకర్తలను రానీయకుండా కట్టడి చేయడం దారుణమన్నారు. 

కోడెల శివరామకష్ణను అప్పుడే అరెస్టు చేసి ఉంటే...
రాష్ట్రంలో ప్రజల ఆస్థులకు రక్షణ కల్పిస్తామని రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసిన టీడీపీ ప్రభుత్వం ...ఈరోజు పౌరుల ఆస్థులను కొల్లగొట్టే ప్రభుత్వంగా తయారైందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌ విమర్శించారు. గతంలో జీసీవీపై దాడిచేసి రూ.1కోటి ఆస్థులను నష్టం కలిగించితే తూతూమంత్రంగా కేసు రిజిష్టర్‌ చేశారన్నారు. దీనికి కారకుడైన కోడెల శివరామకష్ణను అప్పుడే అరెస్టుచేసి ఉంటే ఇప్పుడు ఇన్ని దారుణాలు నరసరావుపేటలో జరిగేవి కాదన్నారు. పోలీసులు  వారి వెసులుబాటు,  పోస్టులకోసం ప్రభుత్వ పెద్దలు ఏమి చెబితే అదే చేస్తూ చూసీ చూడనట్లు పోతున్నారని ఫైర్ అయ్యారు. దీనిని ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని అనేకచోట్ల దాడులు, అకత్యాలు జరుగుతున్నాయన్నారు. 

పోలీసుల సమక్షంలో పట్టణ ప్రజలు చూస్తుండగా విద్యుత్‌ సరఫరాను కట్‌చేసి ఎన్‌సీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదన్నారు. శాంతిభద్రతలు తప్పాయనేదానికి ఇంతకంటే నిదర్శనమేముందని ప్రశ్నించారు.  ఒక వర్గంవారి ప్రయోజనాలకోసం, ఒక వ్యక్తి లాభార్జనకోసం పోలీసు, ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ తామేమి చెబితే అదే చట్టం, రూల్‌ అన్నట్లుగా నరసరావుపేటలో కొనసాగుతుందన్నారు. నల్లపాటి రాముపై 307కేసు పెట్టడమంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. 

పరిపాలించమంటే అరాచకం చేస్తున్నారుః ఎమ్మెల్యే ముస్తాఫా 
పరిపాలించమని అధికారం అప్పగిస్తే టీడీపీ నాయకులు అరాచకం చేస్తున్నారని గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌.ముస్తాఫా మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

దాడిచేసిన వారిపై కేసులు నమోదుచేయాలిః లేళ్ళ అప్పిరెడ్డి  
ఎన్‌సీవీ కార్యాలయంపై దాడిచేసి ధ్వంసంచేసిన వారిపై భేషరత్‌గా కేసులు నమోదుచేయాలని వైయస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళఅప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీ పాలన మరో మూడేళ్ళు మాత్రమే ఉందన్నారు. ప్రజలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. వచ్చేది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన అన్నారు.. అధికారులు టీడీపీ నాయకులు చెప్పినట్లుగా మాపై తప్పుడు కేసులు పెడితే వైయస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. బాధితులకు అండగా ఉంటుందన్నారు. అన్యాయంగా ప్రవర్తించిన అధికారుల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. తామందరమూ చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. 

ఇటువంటి సంఘటనలు దారుణంః బొల్లా 
సౌమ్యుడైన ఎమ్మెల్యే గోపిరెడ్డి కారు పగులకొట్టి ఆయనను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. సిటీ కేబుల్ పై దాడులు చేయటం మంచిదికాదన్నారు. ఇటువంటి సంఘటనలు ఆపకపోతే శాంతిభద్రతలు క్షీణిస్తాయన్నారు.  ఇటువంటి పోకడలు మానుకోవాలని సూచించారు. 

తాజా ఫోటోలు

Back to Top