ఎస్పీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తిరుపతి సిటీ: వైయస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిపై దురుసుగా వ్యవహరించిన తిరుపతి అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మి బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైయస్సార్‌ సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి టి.రాజేంద్ర డిమాండ్‌ చేశారు.  నారాయణస్వామి దళితుడు కావడంతో అర్బన్‌ ఎస్పీ దురుసుగా వ్యవహరించారని, ఇది దళితుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందారని, వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు.

ఇప్పటికైనా ఏర్పేడు ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. మరణించిన వారి కుటుంబాలను ప్రతిపక్షనేత వైయస్‌.జగన్‌ ఓదార్చి వారిలో మనోధైర్యం నింపారని చెప్పారు. టీడీపీకి చెందిన ఇసుక స్మగ్లర్ల అక్రమ రవాణా వల్లే ఘటనకు కారణమని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం లీగల్‌సెల్‌ నగర కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో గోపాల్‌రెడ్డి, కృష్ణవేణమ్మ, పునీత, మహేశ్వరరావు, సాయికుమారి, జగదీష్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top