సొసైటీ ఎన్నికల ప్రక్రియ ఓ ప్రహసనం

హైదరాబాద్, జనవరి 22, 2013:

సహకార సొసైటీల సభ్యుల నమోదులో రిగ్గింగు చోటుచేసుకుందనీ, ఈ అంశాన్ని గవర్నరు దృష్టికి తీసుకెళ్ళినా ఉపయోగం లేకుండా పోయిందనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడారు. సహకార ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను గమనిస్తే.. ఇవి కోపరేటివ్ ఎన్నికలా.. నాన్ కోపరేటివ్ ఎన్నికలా అని అనుమానం వస్తోందని వారన్నారు. నవంబర్ 30నాటికి రాష్ట్రంలో సహకార సంఘాలలో సభ్యుల సంఖ్య 39 లక్షల 18వేలుండగా,  డిసెంబర్ 21 నాటికి అది 50 లక్షల 45 వేలు అయ్యిందన్నారు. ఒక్కరోజులో 11లక్షల 30వేల మంది సభ్యులను చేర్చుకున్నారన్నారు.  రైతులు కానీ వారిని సభ్యులుగా నమోదు చేశారని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలు ప్రతిజిల్లాలో చోటుచేసుకున్నాయన్నారు.  కొత్త సభ్యులను రాత్రికే రాత్రే చేర్చారని చెప్పారు. సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇళ్ళకు తెచ్చి మరీ పని చేశారన్నారు.   నల్గొండ, చిత్తూరు, వరంగల్, కడప, గుంటూరు, ప.గో. నెల్లూరు, విశాఖ.. అన్ని జిల్లాల్లో ఇదే తంతు సాగిందన్నారు.  గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఆరు సొసైటీలకు తాళాలు వేశారనీ, ఇందుకు నిరసనగా ధర్నాలు చేస్తే కేసులు పెట్టారని వారు ఆరోపించారు. సొసైటీల విషయంలో ఈ ప్రభుత్వంలోనే ఇలా జరిగిందన్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా సాగాల్సిన సంఘాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇలా చేస్తోందని వారు ధ్వజమెత్తారు. 'ఈ అంశాలన్నీ పత్రికలలో వెలుగులోకి వచ్చాయి. కాబట్టి గవర్నరు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఎటువంటి చర్యా తీసుకోలేదు. ప్రభుత్వ వైఖరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద'ని వారు చెప్పారు.
     సొసైటీలకు సంబంధించి కోర్టులలో కేసులు పెండింగులో ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని ఉమ్మారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 14న ఆప్కాబ్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. 97వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ద్వారానే సహకార ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే వీలు లేదన్నారు.  అందుకనే సొసైటీలను తమ చేతిలో ఉంచుకోవడానికి ప్రభుత్వం హడావుడిగా ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు. పార్టీ రహితంగా ఎన్నిక జరిపించాలనే స్ఫూర్తి కనిపించడం లేదన్నారు. పారదర్శకత అంతకంటే లేదన్నారు. ఇవి అప్రజాస్వామికమైన ఎన్నికలని ఆయన పేర్కొన్నారు. 2010లో రాష్ట్రం అస్తవ్యస్థంగా ఉంది కాబట్టి ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రభుత్వం చెప్పి తప్పించుకుందన్నారు. ఇప్పుడు పరిస్థితులు బ్రహ్మాండంగా ఉన్నాయా అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. సహకార ఎన్నికల ప్రక్రియ ప్రహసనంగా ఉందనీ, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామనీ ఆయన స్పష్టంచేశారు. నాన్ ఎగ్రికల్చరల్ సెక్టార్లోని సభ్యుల గురించి ఇందులో ప్రస్తావన లేదన్నారు. రైతాంగానికి అన్యాయం చేసే బదులు ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 14 తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇన్ని అక్రమాలు సహకార చరిత్రలోనే లేవని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.

Back to Top