ముఖ్య‌మంత్రే ప్ర‌త్యేక హోదా అడ‌గ‌డం లేదు

హైదరాబాద్ : ఏపీకి ప్ర‌త్యేక హోదా లేదన్నార‌ని, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్య‌మంత్రి అస‌లు ఆ విష‌యాన్ని అడ‌గ‌లేద‌ని బీజేపీ ఇంచార్జీ సిద్ధార్‌సింగ్ స్ప‌ష్టంగా తెలియ‌జేశార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.  చ‌ట్టంలో ఉన్న అంశాల‌ను చేయ‌మ‌న్నారే త‌ప్ప ప్ర‌త్యేక హోదా గురించి ఏ సంద‌ర్భంలోనూ బాబు ప్ర‌ధాన‌మంత్రిని అడ‌గ‌లేద‌ని ఆయన చెప్పార‌ని వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు సైతం సీఎం కార్యాల‌యం గానీ, ఆ పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న‌గానీ బీజేపీపై స్పందించ‌లేదు. దీనిని బ‌ట్టే బీజేపీ వారు చెప్పింది వాస్త‌వం అని తెలుస్తుంది. టీడీపీ ఇలా ప్ర‌జ‌ల‌ను ఎందుకు మోసం చేస్తుంద‌ని ఆయ‌న చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. రాష్ట్ర‌స‌భ‌లో, లోక్‌స‌భ‌లో చంద్ర‌బాబును రెండు చెంప‌దెబ్బలు కొట్టార‌ని ఆరోపించారు. 


బీజేపీ మాట‌ల‌పై ఎందుకు టీడీపీ నాయ‌కులు స్పందించ‌డం లేద‌ని నిల‌దీశారు. కేవ‌లం స్వార్థ రాజ‌కీయాలు, ఓటుకు నోటు కేసు నుంచి త‌ప్పించుకోవడానికే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి తాక‌ట్టు పెట్టార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో క‌రువుతో కొట్టుమిట్టాడుతుంటే, తాగ‌డానికి నీళ్లు లేక ప్ర‌జ‌లు అల్లాడుతుంటే, కోర్టులు సైతం క‌రువుపై అధికార ప్ర‌భుత్వం ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి తన‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు విదేశీ యాత్ర‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మాంజ‌స‌మ‌న్నారు. ఒక ముఖ్య‌మంత్రిగా తాను ఎక్క‌డెక్క‌డికి వెళ్తున్నారో ఇంటిలిజెన్స్‌కు స‌మాచారం ఇవ్వాల్సిన బాధ్య‌త ఉంటుంద‌ని, దానిని సైతం బాబు తుంగ‌లో తొక్కారని దుయ్య‌బ‌ట్టారు.

స్ప‌ష్ట‌త లేని స‌మాధానాలు...
ముఖ్య‌మంత్రి ఎక్క‌డి వెళ్లార‌ని ఎవ‌రినైనా ప్ర‌శ్నిస్తే ఒక‌రు థాయ్‌లాండ్ అని, మ‌రొక‌రు ప‌నామాలో అకౌంట్లు చూసుకోవ‌డానికి వెళ్లార‌ని, ఇంకొక‌రు సింగపూర్‌లో వ్యాపార లావాదేవీలు చూసుకోవ‌డానికి వెళ్లార‌ని తెలుగు త‌మ్ముళ్లు మాట్లాడుకుంటున్నార‌ని ఇందులో ఏది వాస్త‌వ‌మ‌న్నారు. ముఖ్య‌మంత్రి కావాల‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌ని చెప్పిన మాట వాస్త‌వ‌మ‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం నిబంద‌న‌ల‌కు విరుద్దంగా ప్రాజెక్టులు చేప‌డుతున్న ఎందుకు మౌనంగా ఉన్నార‌ని ఆయ‌న అడిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌రువు విష‌యంపై చ‌ర్చించ‌డానికి ప్ర‌ధాన‌మంత్రి రాష్ట్ర ముఖ్య‌మంత్రిని ఈ నెల 17వ తేదీన ఆహ్వానించార‌ని, అప్పుడైనా ప్ర‌త్యేక హోదా గురించి డిమాండ్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మంగా చేప‌డుతున్న ప్రాజెక్టుల‌పై సైతం ప్ర‌ధాన‌మంత్రికి వివ‌రించాల‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంద‌న్నారు.

రూ. 570 కోట్లు చంద్ర‌బాబు బినామీల‌దేనా..?
విజ‌య‌వాడ‌, వైజాగ్ వ‌స్తుంది. చంద్రబాబు బినామీదారులు వైజాగ్ ప‌ట్ట‌ణాన్ని క‌బ‌లించుకోవ‌డానికి  అక్ర‌మ రియ‌ల్ఎస్టేట్ వ్యాపారం చేసుకోవ‌డానికి, అక్రమంగా సంపాధించిన డ‌బ్బును విదేశాల నుంచి రాష్ట్రానికి తీసుకొస్తున్నార‌ని, నేడో, రేపో వాస్త‌వం బ‌య‌ట ప‌డుతుంద‌న్నారు. ఆ డ‌బ్బు బ్యాంకుల‌కు సంబంధించిన‌దా..?  లేక చంద్ర‌బాబు బినామీ దారుల‌దో త్వ‌ర‌లోనే తెలుస్తుంద‌న్నారు. విదేశీ యాత్ర‌ల‌కు వెళ్లిన‌ప్పుడే ఇంత‌పెద్ద ఎత్తున డ‌బ్బు ప‌ట్టుప‌డడం ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని ఆరోపించారు. 

30ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఏ ముఖ్య‌మంత్రి స‌మాచారం లేకుండా విదేశీ యాత్ర‌ల‌కు వెళ్లిన సంఘ‌ట‌నలు లేవ‌న్నారు.
Back to Top