విభజనపై రాష్ట్రంలో పెద్ద నాటకం: కొణతాల

హైదరాబాద్ 28 సెప్టెంబర్ 2013:

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నటి విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు ఆషాఢభూతినీ, మోడర్ను గిరీశాన్నీ గుర్తుచేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ అభివర్ణించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడినా ఆయన క్రికెట్ ప్రస్తావన తెస్తుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియా దర్శకత్వంలో రాష్ట్రంలో పెద్ద డ్రామా జరుగుతోందని పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇందులో  సూత్రధారులూ, పాత్రధారులని చెప్పారు. సీడబ్ల్యూసీ తీర్మానం సంగతే తెలియనట్లు సీఎం మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియా జట్టు ఒక పక్క, కిరణ్ కుమార్ రెడ్డి జట్టు ఒక పక్క క్రికెట్ ఆడుతున్నట్లుందన్నారు. ఇది అసలైన మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు. కిరణ్ ప్రస్తావించిన సమస్యలు ఈరోజు పుట్టినవి కావన్నారు. పదవిపై వ్యామోహం లేనట్టు కిరణ్ మాట్లాడ్డాన్ని ఎద్దేవా చేశారు.

సీఎం పరిస్థితి ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఏరుకున్నట్లుందన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు.  టీడీపీ స్మశాన వైరాగ్యంలో ఉందన్నారు. కాంగ్రెస్‌ ఆడుతున్న క్రికెట్‌ మ్యాచ్‌లో ప్రజల్ని బంతిని చేసి ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజునే సీఎం కిరణ్‌ కేబినెట్‌  రాజీనామా చేసుంటే ప్రకటన ఆగి ఉండేదన్నారు.  అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా సమైక్యవాదం ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్‌ ముందుకు తెలంగాణ నోట్‌ రాకముందే సమైక్య తీర్మానాన్ని పంపించాలన్నారు. టీడీపీ భవిష్యత్‌ అంధకారమై వైయస్‌ఆర్‌సీపీపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం ఇష్టం ఉంటే సీఎం, చంద్రబాబులు రాజీనామాలు చేసేవాళ్లని కొణతాల అభిప్రాయపడ్డారు.

సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన రోజునే రాజీనామా చేసి ఉంటే, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి విభజన ప్రక్రియ ఆగి ఉండేదన్నారు. ఆయన చెప్పినవి ప్రజలకు తెలియని సమస్యలు కావన్నారు. నోట్ క్యాబినెట్ కు రావడానికి ముందు వీటిని ప్రస్తావించడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికలయ్యాక తానే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశించి మాట్లాడుతున్నట్లుందన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో టీడీపీ అనుసరించిన రెండు కళ్ళ సిద్ధాంతం వికటించి, దాని భవిష్యత్తు అంధకార బంధురమైందని కొణతాల చెప్పారు. రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందన్నారు.

తాజా వీడియోలు

Back to Top