రాష్ర్టాన్ని విడగొట్టే హక్కు సోనియాకు లేదు

కర్నూలు, 13 ఆగస్టు 2013:‌

విదేశీయురాలు సోనియా గాంధీకి భారతదేశ సంస్కృతి తెలియదని, అన్నదమ్ముల అనుబంధం గురించి అసలే అవగాహన లేదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే ‌భూమా శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి సోనియా గాంధీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను విభజించే హక్కు లేదని అన్నారు. విదేశీయురాలు కాబట్టే రాష్ట్రాన్ని విడగొట్టే నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా అళ్లగడ్డలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‌మంగళవారం నిర్వహించిన జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది సీమాంధ్ర ప్రాంతమే అని శోభా నాగిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సీమాంధ్రులకు సమన్యాయం జరిగే వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు. సమైక్య ఉద్యమం తీవ్రంగా ఉండటం వల్ల మంత్రులు రాజీనామా నాటాకాలు ఆడుతున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమానికి సమైక్యాంధ్ర మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి అని, రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణను ఇచ్చుకోండని, తనకు అభ్యంతరం లేదు, తెలంగాణకు మేం మద్దతిస్తాం, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండంటూ ఒక బ్లాంక్‌ చెక్కులాంటి లేఖను చంద్రబాబునాయుడు సోనియాకు రాశారన్నారు. రాయలసీమ ప్రాంతానికే చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి సోనియా చెప్పింది విని తల ఊపి రావడానికా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చిందని ప్రశ్నించారు. వీళ్ళిద్దరి వల్లే తెలంగాణను ఇచ్చేందుకు సోనియా ధైర్యం చేశారని విమర్శించారు.

విభజన ప్రకటన వచ్చిన తరువాత సిఎం కిరణ్‌ కంటే ముందే మీడియా ముందుకు వచ్చి స్వాగతిస్తున్నామని. 3, 4 లక్షల కోట్లు ఇచ్చి హైదరాబాద్‌ను తీసేసుకోండని అన్నారని తప్పుపట్టారు. హైదరాబాద్‌ ఏమన్నా మీ జాగీరా? చంద్రబాబూ అని శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. విభజన ప్రకటన వచ్చిన పది రోజుల తరువాత మీడియా సమావేశం పెట్టిన‌ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి వైయస్‌ రాజశేఖరరెడ్డి వల్లే వచ్చిందని నిస్సిగ్గుగా చెప్పారని తూర్పారపట్టారు. వైయస్ఆర్‌ అధికారంలో ఉన్న ఐదేళ్ళలో తెలంగాణ ఇవ్వాలన్న మాట చెప్పడానికి సోనియా గాంధీయే భయపడ్డారన్నారు. అసమర్థమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాబట్టే సోనియా ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగారని విమర్శించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్ని ప్రాంతాలనూ సమానంగా చూశారని శోభా నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణకు అనుకూలమని చంద్రబాబు నాయుడు చెప్పి 2009 లో గులాబీ కండువా వేసుకుని ఎన్నికలకు వెళ్ళారని, అయినా ఆయనను తెలంగాణ ప్రజలు కూడా నమ్మలేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో మహా కూటమి పేరుతో ఒక దొంగ కూటమిని పెట్టుకున్నారని విమర్శించారు. అయినప్పటికీ డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డినే తెలంగాణ ప్రజలు నమ్మారని, అత్యధిక సీట్లు అక్కడ ఆయనకు ఇచ్చారని గుర్తుచేశారు. ఒక సమర్థవంతమైన నాయకుడు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు సమదర్థవంతమైన నాయకుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బయటికి వచ్చారని చెప్పారు.

అలాంటి నాయకుడు శ్రీ జగన్‌ ఒక్కరిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, టిడిపిలు కుట్ర చేసి, అక్రమంగా జైలులో పెట్టి డ్రామాలు ఆడుతున్నాయని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ తమ గుండెల్లోనే ఉన్నారని అలాంటి నాయకుడే తమకు కావాలని రాష్ట్ర ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. చంద్రబాబుకు గాని, కిరణ్‌కుమార్‌రెడ్డికి అంటే సోనియాకు సీమాంధ్రలో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టే రాష్ట్రాన్ని ముక్కలు చేసే దుస్తంత్రానికి ఒడి గట్టారని నిప్పులు చెరిగారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కిరణ్, చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు.

విభజన చేస్తున్నారని తెలిసిన వెంటనే శ్రీ జగన్‌ జైలులో ఉన్నా కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేకు లేఖ రాశారని శోభా నాగిరెడ్డి చెప్పారు. అన్ని ప్రాంతాలకూ సమన్యయం జరగాలని ఆ లేఖలో ఆయన డిమాండ్‌ చేసిన వైనాన్ని తెలిపారు. సీమాంధ్రకు అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటే తాము తప్పకుండా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారన్నారు. బయట ఉన్న చంద్రబాబు, కిరణ్‌రెడ్డి కళ్ళు మూసుకుని పడుకున్నారా? అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయడం లేదని ఆమె నిలదీశారు. కాంగ్రెస్‌ నాయకులంతా రాజీనామాలు చేసి కాంగ్రెస్‌ను పడగొడితే తెలంగాణను సోనియాగాంధీ ఎలా ఇవ్వగలరని అన్నారు.

Back to Top