సొంత ఖజానాలను నింపుకుంటున్న బాబు, కిరణ్


బి.కొత్తకోట (చిత్తూరు జిల్లా):

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ సొంత ఖజానాను పెంచుకోవడంలో ముందున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆరోపించారు. జిల్లా, రాష్ట్ర ప్రయోజనాలను తమ స్వలాభం కోసం వారు తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. లాభాలతో నడుస్తున్న చిత్తూరు డైరీని మూసివేసిన చంద్రబాబు హెరిటేజ్ సంస్థను అభివృద్ధి చేసుకున్నారన్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో రంగంలోకి దించి దోచుకుంటున్నారని శ్రీమతి విజయమ్మ విమర్శించారు.

     తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బి. కొత్తకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రసంగించారు. ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు ఏనాడూ జిల్లా ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేయలేదన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమను నాశనం చేసి, వేల కుటుంబాలను వీధిపాలు చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఇప్పుడున్న సీఎం చిత్తూరు డైరీకి రూ.10 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని, చివరికి ఆ డైరీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన సోదరుడిని దోపిడీకి ఉసిగొల్పి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పరిశ్రమలకు కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందరన్నారు.  

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఎంతో లబ్ది పొందారని శ్రీమతి వైయస్ విజయమ్మ గుర్తు చేశారు. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు చేపట్టి లక్షల ఎకరాలకు సాగు, గ్రామీణ ప్రాంతాలకు తాగు నీరందించారని శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు.  హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 85 శాతం వరకు వైయస్ఆర్ పూర్తి చేశారని, మిగతా పనులు చేయడానికి ఈ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదని ఆరోపించారు. జిల్లాకు చెందిన సీఎం మరో రూ.300 కోట్లు ఖర్చు చేసి ఉంటే రాయలసీమలో సాగు, తాగు నీటి సమస్య ఉండేది కాదన్నారు.  రూ.51,000 కోట్లతో 86 ప్రాజెక్టులు చేపట్టిన ఘనత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందన్నారు.

కుమ్మక్కు రాజకీయాలు

      అత్యంత ధనవంతుడు చంద్రబాబు నాయుడని తెహల్కా 2002లోనే పేర్కొంది. తన ఆస్తులను కాపాడుకోవడానికి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఆయన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని శ్రీమతి వైయస్ విజయమ్మ ఆరోపించారు. అందులో భాగంగానే ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌లో ముగ్గురు ఎంపీలు గైర్హాజరు అయ్యేలా బాబు చేశారని ఆరోపించారు. హెరిటేజ్ సంస్థలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని అదే రోజు సీఇఓ చేసిన ప్రకటన నిదర్శనమన్నారు. రాష్ర్టంలోనూ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైయ్యారని ఆరోపించారు.  తన పలుకుబడితో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి పలు కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకుంటున్నారని అన్నారు.

      ఇచ్చిన మాటను తప్పడంలోనూ, హామీలను తుంగలో తొక్కడంలోనూ చంద్రబాబును మించిన నేత ఎవరూ ఉండరని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు. మద్యపానం ఎత్తివేశారని, ఆడపిల్ల జన్మిస్తే రూ.5 వేలు ఇస్తామన్న హామీని ఎత్తివేశారని, మహిళా విద్యార్థులకు సైకిళ్లు ఇస్తామని చేతులు ఎత్తివేశారన్నారు. ఇపుడు రైతుల రుణాలు మాఫీ చేస్తామనే ప్రకటనలతో ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని అన్నారు.

     అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై శ్రీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.  మంత్రివర్గం జారీ చేసిన 26 జీవోలు సక్రమమే అయితే శ్రీ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసులు పెట్టి జైలుకు పంపారని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

ఎన్నికోట్లకు అమ్ముడు పోయావు బాబూ?

     ఎమ్మెల్యేలు అమ్ముడు పోతున్నారని అంటున్న చంద్రబాబు నాయుడు మొదట ఎన్ని కోట్లకు అమ్ముడు పోయాడో చెప్పాలన్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినప్పుడుగానీ, వైశ్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను ఉంచినప్పుడుగానీ ఎన్ని కోట్లు పెట్టి కొన్నారో, అమ్ముడు పోయారో చంద్రబాబు చెప్పాలని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు. బాబు విధానలు నచ్చకనే ఎమ్మెల్యేలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసిన వైయస్ఆర్, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకంతోనే పలువురు నేతలు, ఎమ్మెల్యేలు చేరుతున్నారని స్పష్టం చేశారు.

     బి.కొత్తకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీమతి వైయస్ విజయమ్మ వచ్చే వరకు ఎంతో ఓపికతో ఎదురు చూశారు.

తాజా వీడియోలు

Back to Top