<strong>మంగళగిరి (గుంటూరు జిల్లా), </strong>25 మార్చి 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారంనాటి షెడ్యూల్ పూర్తయింది. ఆమె ఈ రోజు మొత్తం 10.2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలెం నుంచి ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర డోలాస్‌నగర్, నులకపేట, ముగ్గురోడ్, తాడేపల్లిలోని నెహ్రూ బొమ్మ సెంటర్, ఉండవల్లి, కె.ఎల్.రావునగర్‌ల మీదుగా కొనసాగింది. అక్కడి నుంచి ఆమె సోమవారం రాత్రి బసచేసే కేంద్రానికి చేరుకున్నారు.<br/>పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల సోమవారంనాడు ముగ్గురోడ్ వద్ద మహానేత డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి తాడేపల్లి చేరుకుని నెహ్రూ బొమ్మ సెంటర్‌లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు హాజరై తమ బాధలు శ్రీమతి షర్మిల ముందు చెప్పుకున్నారు.<br/>కాగా, శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారం మధ్యాహ్నంతో గుంటూరు జిల్లాలో ముగుస్తుంది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఆమె కృష్ణా జిల్లాలోకి అడుగు పెడతారు. కృష్ణాజిల్లాలో శ్రీమతి షర్మిల మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర 102వ రోజున కృష్ణాజిల్లాలో ప్రారంభం అవుతుంది.