సీఎం కిరణ్‌ డబుల్‌ గేమ్!

కర్నూలు, 14 ఆగస్టు 2013:

రాయలసీమ ప్రజలను ఆందోళనలోకి నెట్టివేసే విధంగా సీమకే చెందిన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పాలమూరు లిఫ్టు ఇరిగేషన్ సర్వే‌ కోసం జీవో 72ను ఇవ్వడమే కాక దాని కోసం రూ. 7 కోట్లను సిఎం కిరణ్‌ స్వయంగా విడుదల చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య మరింతగా చిచ్చుపెట్టే విధంగా ఆయన చేస్తున్నారని ఆరోపించారు. జీఓ 72ను వెంటనే వెనక్కి తీసుకోవాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మిగులు వరద జలాలపైనే ఆధారపడిన రాయలసీమను ఆదుకోవాలని కోరారు. ఆ జీవోను వెనక్కి తీసుకునే వరకు రాయలసీమ మంత్రులు‌ ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటే‌ష్ లను నిలదీయాలని ప్రజలకు శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమకు నీళ్లు అందేంతవరకు వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కర్నూలులో ఆమె బుధవారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ విభజనను ప్రకటించిన తరువాత సాగునీటి విషయంలో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని శోభా నాగిరెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తూ ఉంటే.. రాయలసీమకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలోనే సీమాంధ్రులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో ఉందని శోభా నాగిరెడ్డి విచారం వ్యక్తంచేశారు.

రాయలసీమలోని హంద్రీ నీవా, ఎస్ఆర్‌బిసి, తెలుగుగంగ ప్రాజెక్టులు వరదనీరు మిగులు జలాలపై ఆధారపడి కట్టినవి అన్నారు. వీటితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలు కల్వకుర్తి, నెట్టెంపాడు, నల్గొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ కూడా వరద మిగులు జలాలపై ఆధారపడి కట్టినవే అన్నారు. ఈ ప్రాజెక్టుల కోసమే మనం ప్రతి సంవత్సరమూ నీటి కోసం కర్నాటకతో పోరాటాలు చేస్తున్నామన్నారు. ఒక పక్కన సమైక్య రాష్ట్రంలో ఉండగానే జిల్లాలు, రాష్ట్రాల మధ్యన ఇన్ని యుద్ధాలు జరుగుతుంటే.. మధ్యలో మూడో రాష్ట్రాన్ని పెట్టడమేమిటని ప్రశ్నించారు. రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతూనే అదే రోజున జీవో 72ను విడుదల చేసి డబుల్‌గేమ్‌ ఆడారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు రోజుకు 2 టిఎంసిల చొప్పున 70 టిఎంసిల నీటిని సరఫరా చేయాలంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి జీవో ఇచ్చిన పరిస్థితుల్లో ఇక శ్రీశైలం జలాశయానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తామని శోభా నాగిరెడ్డి నిలదీశారు. జూరాల నుంచి వచ్చే నీటిలో 70 టిఎంసిలు తీసేస్తే శ్రీశైలంలో ఎక్కడ 840 అడుగుల నీటిమట్టం ఉంటుంది? ఎస్ఆర్‌బిసికి గాని, తెలుగుగంగకు కాని, హంద్రీ నీవాకు గాని నీళ్ళు ఎప్పుడు వస్తాయని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా కోసం సర్వేలు జరిగితే.. మిగులు జలాలపైనే ఆధారపడిన సీమ ప్రాజెక్టుల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తేనా అనే అనుమానం ప్రజలకు వస్తోందన్నారు.

ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతం వ్యక్తి ఉన్నారు కాబట్టి తమ ప్రాంతానికి న్యాయం చేసుకోవాలని చూస్తున్నారని, సీమకు చెందిన వ్యక్తిగా కిరణ్‌ ఏం చేస్తున్నారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్రలో ఒక్క సీటూ గెలిచే పరిస్థితి లేదని, ఈ ప్రాంతంలో తిరిగే అవకాశం లేదు కనుక రాజకీయ లబ్ధి కోసమే విభజన నిర్ణయంపై సంతకం పెడుతున్నారా? అని ఆమె నిలదీశారు. వరద మిగులు జలలాపై ఆధారపడి నిర్మించిన హంద్రీ నీవా, ఎస్ఆర్‌బిసి, తెలుగుగంగ ప్రాజెక్టులను ప్రశ్నార్ధకం చేసే జీవో 72ను తక్షణమే ఉపసంహరించాలని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top