‌సీఎం కిరణ్ రాజీనామా అంటూ కొత్త డ్రామా

హైదరాబాద్ :

రాష్ట్ర విభజనకు పక్కా రూట్ మ్యా‌ప్‌తో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి‌ మరో రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాజీనామా అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా‌ పక్ష ఉపనాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి విమర్శించారు. సీడబ్ల్యూసీ సమావేశం మొదలు విభజన బిల్లు అసెంబ్లీకి తేవడం, ఎలాంటి ఆటంకం లేకుండా చర్చ జరిపించి దానిని తిప్పి పంపడంతో పాటు విభజనకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని కేంద్రానికి చేరవేసింది కిరణ్‌కుమార్‌రెడ్డి కాదా? అని ఆమె ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టిద్దామని వైయస్ఆర్‌సీపీ చెప్పినప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా రాజీనామా చేసి ఉంటే విభజన ప్రక్రియ ఇంత వరకు రాకపోయేదన్నారు. కిరణ్‌ అలా చేసి ఉంటే తామంతా అభినందించేవారమని శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్ర సమైక్యత కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటోందని శోభా నాగిరెడ్డి తెలిపారు. `పదవులకు రాజీనామాలు చేశాం. రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చాం. నిరాహారదీక్షలు చేశాం. సమైక్యతీర్మానం చేయాలని అసెంబ్లీలో పట్టుబట్టాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్ నేతృత్వంలో శ్రీమతి విజయమ్మతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును కేంద్రానికి పంప వద్దని విన్నవించాం' అని ఆమె తెలిపారు.

రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయ పార్టీల నాయకులను గతంలో కలిసి మద్దతు కూడగట్టిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ జగన్‌ బిల్లు పార్లమెంటుకు రానున్న నేపథ్యంలో వారిని మరోసారి కలిసి మద్దతు కోరనున్నానున్నారని శోభా నాగిరెడ్డి పేర్కొన్నారు. పాకిస్తాన్, చైనా ఆక్రమణలకు పాల్పడుతున్నా, బాంబు పేలుళ్లు జరిగినా, భారీ తుపానులు విరుచుకుపడినా స్పందించని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం కోసం మాత్రం ఎందుకంత తొందరపాటు ప్రదర్శిస్తోందని నిలదీశారు.

ఢిల్లీలో ఎవరెవరివో కాళ్లు పట్టుకునే బదులు టీడీపీ నాయకులు చంద్రబాబు కాళ్లు పట్టుకొని విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరింపచేయాలని శోభా నాగిరెడ్డి సూచించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టి, తెలుగువారంటే నవ్వుకునేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లులో లోపాలున్నప్పుడు అసెంబ్లీలో ఎందుకు చర్చించారని, ముందే తిప్పి పంప వచ్చు కదా? అని దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ నేతలు అడుగుతున్న ప్రశ్నకు సీఎం కిరణ్, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.

తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు బిల్లులో లోపాలున్నాయని కిరణ్ చెప్పేంత వరకు తెలియలేదా? ‌అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం రాలేదంటూ చంద్రబాబు మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కిరణ్ నిజంగా కేంద్రాన్ని వ్యతిరేకించి మౌనదీక్షకు కూర్చుంటే ఆయనతో‌ పాటు పీసీసీ అధ్యక్షుడు ఎందుకు కూర్చుంటారని అన్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ పెట్టే అభ్యర్థుల గెలుపునకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎదిరిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక శ్రీ జగన్‌పై గాలి వార్తల దుష్ర్పచారం చేస్తోందని దుయ్యబట్టారు. పత్రికలు ప్రజల విశ్వాసం చూరగొనాలే తప్ప, కోల్పోయేలా వార్తలు రాయకూడదని హితవు పలికారు.

నాయకులెవరినీ శ్రీ జగన్ సరిగా పట్టించుకోరని, ఎవరితో మాట్లాడరని, సబ్బం‌ హరిని కూడా పట్టించుకోలేదంటూ ఒక పక్కన వార్తలు రాస్తూ మరోవైపు మళ్లీ సబ్బం హరిని శ్రీ జగన్ వేడుకున్నట్లు వార్తలు రాయడం ఆంధ్రజ్యోతి‌కే సిగ్గుచేటు అని శోభా నాగిరెడ్డి తూర్పారపట్టారు.

Back to Top