విభజనకు పనికివచ్చిన చంద్రబాబు అనుభవం

హైదరాబాద్:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుభవం దేనికి ఉపయోగపడిందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా‌ నాగిరెడ్డి  ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు తమ నాయకుడు అది చేశాడు, ఇది చేశాడు, ఎంతో అనుభవం ఉంది అని చెబుతుంటారని, చంద్రబాబు అనుభవం రాష్ట్రం విభజనకు మాత్రం ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటి? అని  అడిగారు. చంద్రబాబు నాయుడు లేఖే సోనియా గాంధీ ధైర్యానికి కారణం అని చెప్పారు. చిన్న వయసులో రాజకీయాలలోకి వచ్చిన వైయస్ జగన్మోహన్‌రెడ్డి అనుభవం లేకపోయినా సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారని చెప్పారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ముక్కలు చేస్తోందని శోభా నాగిరెడ్డి అన్నారు. కాంగ్రె‌స్ నేతలు తలా ఒక మాటతో ఉద్యమం నీరుగారుతోందని పేర్కొన్నారు. కొంతమంది రాయల తెలంగాణ అని, మరికొంత మంది విశాఖపట్నం రాజధాని చేయమని, ఇంకొందరు ఒంగోలు వద్ద రాజధాని చేయమని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని తెలిపారు.

సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వైయస్ఆర్‌సీపీ పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు శోభా నాగిరెడ్డి చెప్పారు. ఈ నెల 10 నుంచి విద్యార్థులు, యువకులు ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. 11న రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల రోజు ఈ నెల 12న రహదారుల దిగ్బంధనం చేపడతామన్నారు. 13న అన్ని వర్గాల వారితో సమావేశమవుతామని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top