హైదరాబాద్, 3 జూలై 2013:
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ బుధవారంనాడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపేలా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే క్రమంలో శ్రీమతి విజయమ్మ వరంగల్‌లో పర్యటిస్తారు.
బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన శ్రీమతి విజయమ్మ వరంగల్ చేరతారు. ముందుగా జిల్లాలోని రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో ఏర్పాటు చేసిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి హన్మకొండ హంటర్ రోడ్డులోని అభిరామ్ గార్డెన్‌లో జరిగే పార్టీ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ కార్యకర్తల విస్తృత సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో శ్రీమతి షర్మిల స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.
అనంతరం శ్రీమతి విజయమ్మ సాయంత్రం వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. శ్రీమతి విజయమ్మ రాక సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.