బిల్లుపై చర్చకు ముందే ఓటింగ్‌ జరగాలి

హైదరాబాద్ :

టీ ముసాయిదా బిల్లుపై చర్చకు ముందే ఓటింగ్ నిర్వహించాలని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ ‌పార్టీ గౌరవ  అధ్యక్షురాలు, శాసనసభా పక్షం నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ‌అసెంబ్లీలో బలంగా డిమాండ్ చేశారు. ‌ముసాయిదా బిల్లుపై చర్చించడం అంటే విభజనకు అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ జరిగితే అది కేవలం అభిప్రాయ సేకరణకే పరిమితమవుతుందన్న మాటలు వినిపిస్తున్నందున ముందుగా ఓటింగ్ నిర్వహించి విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉందని కుండబద్దలు కొట్టారు. ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న అనుమానాలపై అసెంబ్లీలో ‌ఆమె గురువారం ఉదయం సభలో మాట్లాడారు.

‘వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముసాయిదా బిల్లుపై చర్చకు వ్యతిరేకం కాదని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు. చర్చను అడ్డుకోవటానికి తాము పోరాడడంలేదన్నారు. ఒక పద్ధతి, సంప్రదాయం అంటూ లేకుండా, కనీసం ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత సభలో లేని సమయంలో విచిత్రమైన పరిస్థితిలో బిల్లు ప్రవేశపెట్టడం మన దురదృష్టం అన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు విభజన చేయటానికి కాదన్నారు. ఒక విధానం అనేది ఉండాలన్నారు. బిల్లు వచ్చినప్పుడు రాష్ట్ర సంబంధిత తీర్మానం ఉండాలని ఎన్నో కమిషన్లు చెప్పాయని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు.

అయితే.. ఇలాంటివి ఏవీ లేకుండానే మనం అసెంబ్లీలో బిల్లు పెట్టుకున్నాం అని శ్రీమతి విజయమ్మ అన్నారు. పశ్చిమబెంగాల్‌ సీఎంగా బీసీ‌ రాయ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలోని బేరూబారూ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో కలిపే అంశానికి సంబంధించి ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టిప్పుడు చేసిన తీర్మానం ఆధారంగా నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవటంతో ఆ ప్రాంతం ఇప్పుడు మనదేశంలోనే అంతర్భాగంగా ఉండే పరిస్థితి వచ్చింది’ అని‌ ఆమె విజయమ్మ గుర్తుచేశారు.

చర్చ తరువాత ఓటింగ్ జరుగుతుందో లేదో‌ :
‘ఇప్పుడు మన అసెంబ్లీలో చెప్పేవివి కేవలం అభిప్రాయాలు మాత్రమేనని, తర్వాత ఓటింగ్ ఉండదని నాయకులు చెప్తున్న నేపథ్యంలో మా భయాలు మాకున్నాయి. అందుకే ముందు తీర్మానం పెట్టాలని చాలా పోరాడాం, బిల్లు రాక‌ ముందే అసెంబ్లీలో తీర్మానం చేద్దామని ముఖ్యమంత్రిని కోరాం. తీర్మానం చేసేలా చూడాలని రాష్ట్రపతికి కూడా విజ్ఞప్తి చేశాం. ఇలా అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ తీర్మానం లేకుండానే బిల్లు పెట్టారు. ఇక తర్వాత ఓటింగ్ జరుగుతుందో లేదో నమ్మకం లేదు. సభ విభజనకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది ముందే తెలుసుకోవాలని కోరుతున్నాం. మేం మాట్లాడకపోతే విభజనకు అనుకూలమని మమ్మల్ని టార్గె‌ట్ చేస్తున్నారు.‌ కానీ పదేళ్లు కలిసి ఉండాలనో, రాజధాని ఎక్కడ అనో ఇలాంటి అంశాలపై చర్చిస్తే దాని అర్థమేంటి అధ్యక్షా? విభజనకు అనుకూలమని కాదా? అందుకే నేను అందరినీ అడుగుతున్నా, చేతులెత్తి అభ్యర్థిస్తున్నా. అభివృద్ధి చెంది మూడవ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచేలా చూడాలని కోరుతున్నా. మేం విభజనకు వ్యతిరేకం, సమైక్యంగా ఉండాలనే ముందుగా ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మేం చర్చలకు వ్యతిరేకం, అడ్డంకి కాదు. దీన్ని రికా‌ర్డు చేయాలని కోరుతున్నా’’అని శ్రీమతి విజయమ్మ అన్నారు.

అడుగడుగునా కాంగ్రెస్, టీడీపీ అడ్డు :
అసెంబ్లీ గురువారం ప్రారంభం అవగానే వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేయటంతో సభను‌ స్పీకర్ అరగంట‌ పాటు వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేయటంతో, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఇప్పటికే ఐదురోజుల సమయం వృథా అయిందని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ఉన్న అనుమానాలపై మాట్లాడేందుకు తొలుత విజయమ్మకు అవకాశం ఇస్తానని పేర్కొనటంతో వారు శాంతించారు.

‌ఆ వెంటనే శ్రీమతి విజయమ్మ లేచి మాట్లాడడం ప్రారంభించగానే ఇటు కాంగ్రెస్, అటు దేశం సభ్యులు గగ్గోలు పెడుతూ అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ సభ్యులు ఇదేమి దారుణం అంటూ నిలదీశారు. ఒక దశలో టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు లేచి నేరుగా వైయస్ఆర్‌సీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సభ మొత్తం గందరగోళంగా మారినా వెంటనే జోక్యం చేసుకోని స్పీకర్ అలా‌గే చూస్తూ ఉండిపోయారు. టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యుల గందరగోళం మధ్యనే శ్రీమతి విజయమ్మ మాట్లాడాల్సి వచ్చింది.

పశ్చిమబెంగాల్‌లోని బేరూబారూ విషయాన్ని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించినప్పుడు కూడా సభ్యులు ఆమెను మాట్లాడనీయలేదు. వారిని వారించాల్సిన స్పీకర్, కేవలం బిల్లుపై ఉన్న అనుమానాలను మాత్రమే ప్రస్తావించాలని, ఉపన్యాసం వద్దంటూ ఆమెను వారించే ప్రయత్నం చేయటం గమనార్హం. బిల్లు పెట్టినప్పుడు సభలో చంద్రబాబు లేరని శ్రీమతి విజయమ్మ పేర్కొనటంపై టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందు చర్చించి ఆ తర్వాత ఓటింగ్‌ ద్వారా బిల్లును ఓడించాలని కేశవ్ అనటంతో టీఆర్‌ఎస్‌, తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యులు లేచి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ టీడీపీ సభ్యులు కిమ్మనకుండా కూర్చోవటం విశేషం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top