గుండంపల్లి కాల్వ పనులు పరిశీలించిన విజయమ్మ

ఆదిలాబాద్, 2 జూలై 2013:‌

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తన తన హయాంలో ఒక్క పైసా పన్నులు వేయలేదని... డజన్ల‌ కొద్దీ సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేశారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గుండంపల్లి హైలెవ‌ల్‌ కెనాల్ పనులతో పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజె‌క్టు పనులను ఆమె మంగళవారం పరిశీలించారు. అక్కడ వైయస్‌ఆర్ శంకుస్థాపన చేసిన శిలాపలకానికి‌ నీళ్ళు, పాలతో అభిషేకం చేశారు. అనంతరం వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జెండాను‌ శ్రీమతి విజయమ్మ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ.. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు వైయస్‌ఆర్ పెద్ద ఎత్తున పెన్షన్లు‌ అందించారని, పేదలకు ఇళ్ళు కట్టించారని చెప్పారు. అక్క చెల్లెళ్ళకు ఆర్ధిక భారం పడకూడదని గ్యాస్‌పై అదనంగా పెంచిన ధరను ప్రభుత్వం నుంచే వైయస్‌ఆర్‌ చెల్లించారని గుర్తుచేశారు. మహిళలను లక్షాధికారులను చేయాలని పావలా వడ్డీకే రుణాలు అందించారన్నారు. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే జలయజ్ఞం పథకాన్ని చేపట్టారన్నారు.

పంచాయతీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని, ప్రతి పంచాయతీ కార్యాలయంపైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను రెపరెపలాడించాలని శ్రీమతి విజయమ్మ స్థానికులకు పిలుపునిచ్చారు.

అయితే..ఆ మహానేత మరణించిన తరువాత ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. త్వరలోనే జగన్‌బాబు నాయకత్వంలో రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి విజయమ్మ అన్నారు.

Back to Top