మీ పాలనే తెస్తాననే ధైర్యం ఉందా?

అనంతపురం :

‘మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనను తిరిగి తెస్తామనే వాగ్దానంతో మేం ఎన్నికలకు వెళుతున్నాం. తొమ్మిదేళ్ల ‌మీ చీకటి పాలనను తిరిగి తెస్తానన్న హామీతో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ఉందా?’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సవా‌ల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి, హిందూపురం మున్సిపాలిటీల్లో ఆమె‌ ఆదివారంనాడు రోడ్‌షోలు నిర్వహించి.. బహిరంగ సభల్లో ప్రసంగించారు.

అలా చేసి ఉంటే రాష్ట్ర విభజన ఆగేది :

‌'సీడబ్ల్యూసీ, యూపీఏ పార్టీలు తెలంగాణ తీర్మానం చేసిన మరుక్షణమే ప్రజాప్రతినిధులు గంపగుత్తగా రాజీనామాలు చేయాలని, విభజనను అడ్డుకోవాలని వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్, టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరక ముందే శాసనసభలో సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. కానీ రాష్ట్ర విభజనను ఆపుతానంటూ చివరి‌క్షణం వరకూ సీఎం పదవిని అనుభవించిన కిరణ్.. అంతా అయిపోయాక ఆ పదవికి రాజీనామా చేసి, తానే సమైక్య చాంపియన్‌ను అంటూ మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నారు.. కిరణ్‌కు బుద్ధి చెప్పండి' అని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు.

వైయస్ఆర్ సువర్ణయుగాన్ని జగ‌న్ ‌తీసుకువస్తారు :

‌'శ్రీ వై‌యస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ సువర్ణయుగాన్ని మళ్లీ తెస్తారు. సీఎంగా పదవి చేపట్టిన తొలిరోజునే ‘అమ్మఒడి’ పథకం ఫైలుపై సంతకం చేస్తారు.. ఈ పథకం కింద.. కుటుంబంలో ఇద్దరు పిల్లలు బడికి వెళితే ప్రతినెలా రూ.వెయ్యి అమ్మ ఖాతాలో వేస్తారు. రూ.200 నుంచి వృద్ధాప్య పెన్షన్‌ను రూ.700కు పెంచుతారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసే ఫైలుపై సంతకం చేస్తారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేసే ఫైలుపై నాలుగో సంతకం చేస్తారు’ అని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు.

బూటకపు వాగ్దానాల బాబు :
‘తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబూ.. పంట రుణాలు మాఫీ చేయాలని కేంద్రానికి లేఖ రాసే ఆలోచన మీరు ఏనాడైనా చేశారా? కనీసం పంట రుణాలపై వడ్డీనైనా మాఫీ చేసే ఆలోచన వచ్చిందా? వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇద్దామనే సాహసం చేశారా? 2004 ఎన్నికల్లో వ్యవసాయానికి ఉచిత విద్యు‌త్ ఇస్తామని వై‌యస్ఆర్ హామీ ఇస్తే.. అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని బాబు ఎగతాళి చేయలేదా? ఏ ఒక్క వాగ్దానాన్నైనా అమలు చేశారా? ఇప్పుడు ఆ‌ల్‌ఫ్రీ అంటూ మోసం చేయడానికి ఊరూవాడా తిరుగుతున్నారు. బూటకపు వాగ్దానాలతో వస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పండి. తన తొమ్మిదేళ్ల పాలనలో బిల్లీరావు, రామోజీరావు, మురళీమోహన్, సీఎంరమేశ్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరిలకు మాత్రమే చంద్రబాబు లబ్ధి చేకూర్చార'ని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు.

తాజా ఫోటోలు

Back to Top