బాబులో విశ్వసనీయత, నీతి నిల్

అనంతపురం:

‘తొమ్మిదేళ్ల పరిపాలనలో ఒక్క రోజైనా నీతిగా నిజాయితీగా పనిచేశావా? చంద్రబాబూ‌' అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిలదీశారు. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయం కాదా? ఏలేరు స్కామ్, మద్యం టెండర్ల వ్యవహారం.. ఐఎంజీ భూ కుంభకోణం.. ఇలా రోజుకో అక్రమానికి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఎఫ్‌డీఐల విషయంలో రాజ్యసభలో టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యేలా చక్రం తిప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడటంలో మర్మమేమిటి? అని అన్నారు. టీడీపీ పార్టీ సభ్యులకు విప్ జారీచేసి ఏడాది క్రితం కి‌రణ్ ప్రభుత్వాన్ని కాపాడి ఉండకపోతే తెలుగు జాతి రెండు ముక్కలయ్యేదా?’ అంటూ శ్రీమతి విజయమ్మ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మడకశిర, ధర్మవరం, అనంతపురంలో వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలకు జనం పోటెత్తారు. మూడు చోట్లా బహిరంగసభల్లో ఆమె మాట్లాడారు.

నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నాయకుడు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని‌ శ్రీమతి విజయమ్మ చెప్పారు. ‘రాజకీయాల్లో విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్.. వైఎస్ అన్న పేరు వింటేనే ప్రజలకు ఓ భరోసా.. వైయస్ జగన్మోహన్‌రెడ్డి అదే బాటలో నడుస్తున్నారు’ అని అన్నారు.

జగన్‌తోనే సువర్ణయుగం సాధ్యం :
జగన్‌బాబు సీఎంగా బాధ్యతలు చేపడితే వైయస్ఆర్‌ కాలం నాటఇ సువర్ణయుగం మళ్లీ వస్తుందని శ్రీమతి విజయమ్మ అన్నారు. వైయస్ఆర్ అమలు చేసిన పథకాలతో‌ పాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారన్నారు. అమ్మ ఒడి పథకం, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు పెన్షన్‌లు రూ.700కు పెంచుతారని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు మగ్గాలను ఉచితంగా ఇస్తారు. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తారన్నారు. ముడిసరుకులను రాయితీపై ఇస్తారన్నారు. వడ్డీ లేని రుణాలను పంపిణీచేసి నేత కార్మికుల్లో ధైర్యాన్ని నింపుతారని హామీ ఇచ్చారు. ఆప్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయించి.. చేతినిండా పని కల్పిస్తారని ధైర్యాన్నిచ్చారు.

శ్రీమతి విజయమ్మ ఇంకా ఏమన్నారంటే... :
- చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించారు. 23,500 మందిని ఉద్యోగాల నుంచి తొలగించి రోడ్లపైకి ఈడ్చారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే.. జీతాలు, పెన్షన్‌లు, డీఏలు ఇవ్వడం వల్ల ఖజానాపై భారం పడుతుందని రాగాలు తీశారు. ఇప్పుడేమో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఊరూరా ఊదరగొడుతున్నారు.
- రాష్ట్రంలో 3.50 కోట్ల ఇళ్లున్నాయి.. 23,500 మంది ఉద్యోగులను తొలగించిన చంద్రబాబు.. 3.50 కోట్ల ఉద్యోగాలు ఇవ్వగలరా.. ఒక్క క్షణం ఆలోచించండి.

- చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో కరువు కాటకాలు రాజ్యమేలాయి. సాగునీళ్లు కాదు కదా కనీసం తాగునీళ్లు కూడా దొరకని దుస్థితి. కరువుతో 15 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఏ ఒక్క రైతుకైనా పరిహారం అందించలేదు.. పైగా తిన్నది అరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్న ప్రబుద్ధుడూ ఆయనే అని నిప్పులు చెరిగారు.

పదవిలో ఉన్నప్పుడు కిరణ్‌ చేసిందేమిటి ? :
మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ మరణించిన నాలుగు నెలలకే కాంగ్రెస్, టీడీపీ నాయకులు కలసి తెలుగు జాతిని రెండు ముక్కలు చేసే కుట్రకు నాంది పలికా‌రని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాయన్నారు. మహానేత వైయస్ఆర్ బతికి ఉంటే.. తెలుగు జాతి రెండు ముక్కలయ్యేదా?‌ అని ప్రశ్నించారు. ఒక వైపున రాష్ట్ర విభజనకు కిరణ్‌ రూట్‌మ్యాప్‌లు తయారుచేస్తూనే.. మరో వైపు చివరి ‌బంతి తన దగ్గర ఉందంటూ మభ్యపెట్టారన్నారు. ఇప్పుడు 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్ర విభజనను ఆపుతానంటూ కొత్త రాగం అందుకున్నారని దుయ్యబట్టారు.

Back to Top