కుప్పంనే పట్టించుకోని బాబు రాష్ట్రాన్నేం చేస్తారు?


విశాఖపట్నం:

సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాల్టీ చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తానంటే ఏ విధంగా నమ్మగలమని వైయస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభా స్థానం అభ్యర్థి శ్రీమతి వైయస్‌ విజయమ్మ వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తానని చంద్రబాబు చెప్పడంలో ఏ మాత్రం నిజం లేదన్నారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పం పాతికేళ్లుగా పంచాయతీగానే మిగిలిపోయిందని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సింహాచలం, భీమిలి, విశాఖ నగర పరిధిలోని చినవాల్తేరు, రాంనగర్, హెచ్‌బీ కాలనీ సభల్లో శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు.

తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కనీసం తన నియోజకవర్గాన్ని మునిసిపాల్టీ కూడా చేయలేకపోయారని గుర్తుచేశారు. చంద్రబాబు చెప్పే మాటలోను, ఇచ్చే హామీలోనూ ఏ కోశానా నిజాయితీ కనిపించదన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు ఆ పార్టీ నెత్తినే చెయ్యేసే రకం అని విమర్శించారు.

బంగారం లాటి మన రాష్ట్రాన్ని విడగొట్టని కేంద్రానికి రెండు సార్లు లేఖ ఇచ్చింది చంద్రబాబే అన్నారు. మళ్లీ ఇప్పుడు అన్యాయంగా విభజించారంటూ మొసలికన్నీరు కార్చేదీ ఆయనే అని ఎద్దేవా చేశారు. రెండు నాల్కల ధోరణి ఆయనకు అలవాటే అన్నారు.

Back to Top